ఇద్దరు కుమార్తెలను బావిలో తోసి.. తండ్రి ఆత్మహత్య

పెళ్లికి పోయొద్దాం బిడ్డా అంటూ ఇద్దరు కుమార్తెలను తీసుకెళ్లిన ఆ తండ్రి వారి ప్రాణాలు తీయడమే కాకుండా తానూ బలవన్మరణానికి పాల్పడ్డారు.

Published : 05 Feb 2023 05:50 IST

జగిత్యాల జిల్లాలో దారుణం

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: పెళ్లికి పోయొద్దాం బిడ్డా అంటూ ఇద్దరు కుమార్తెలను తీసుకెళ్లిన ఆ తండ్రి వారి ప్రాణాలు తీయడమే కాకుండా తానూ బలవన్మరణానికి పాల్పడ్డారు. కన్నబిడ్డలను వ్యవసాయ బావిలో తోసిన తాను పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జగిత్యాల జిల్లా నర్సింగాపూర్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన అందరినీ కలచివేసింది. జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌, సీఐ కృష్ణకుమార్‌, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన గడ్డం జలపతిరెడ్డి (40), కవిత దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు జష్మిత (12), మధుమిత (11), ప్రణిత్య(7) ఉన్నారు. శుక్రవారం రాత్రి జగిత్యాలలో వివాహ వేడుక ఉందని జలపతిరెడ్డి తన ముగ్గురు పిల్లలతో వెళ్లేందుకు సిద్ధమవగా పెద్ద కుమార్తె రానంది. దీంతో మధుమిత, ప్రణిత్యను తీసుకుని వివాహానికి వెళ్లాడు. రాత్రి అక్కడి నుంచి బయలుదేరినా ఇంటికి చేరలేదు. శనివారం ఉదయం నర్సింగాపూర్‌ శివారులో వ్యవసాయ బావి వద్ద జలపతిరెడ్డి మృతదేహం కనిపించడంతో స్థానికులు  పోలీసులకు సమాచారమిచ్చారు. అనుమానం వచ్చి బావిలో గాలించగా మధుమిత, ప్రణిత్యల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించి శవపరీక్ష నిర్వహించారు. సంఘటన స్థలానికి జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌, సీఐ కృష్ణకుమార్‌, ఎస్సై అనిల్‌ చేరుకుని వివరాలు సేకరించారు. జలపతిరెడ్డి జేబులో సూసైడ్‌ నోట్‌ లభించింది. నర్సింగాపూర్‌లో ఓ కాలనీ ఏర్పాటుకు జలపతిరెడ్డి వ్యవసాయ భూమిని ప్రభుత్వం సేకరించింది. పరిహారం చెల్లించకపోవడంతో కేసు వేయగా ప్రభుత్వం రూ.45,95,516 కోర్టులో జమ చేసింది. న్యాయవాది చుట్టూ కొన్నేళ్లుగా తిరుగుతున్నా ఆ సొమ్మును ఇప్పించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు జలపతిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదుతో న్యాయవాదిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టు నుంచి డబ్బులు రాకపోవడం, జలపతిరెడ్డి వద్ద చాలామంది అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం, ఆయనకు ఆర్థిక భారం పెరిగిపోవడంతో మానసికంగా కుంగిపోయి ఈ దారుణానికి పాల్పడ్డట్లు గ్రామస్థులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని