Jagtial: పదేళ్లకు తండ్రి రాక.. అంతలోనే కొడుకు విగతజీవిగా..

ఆ తండ్రి తన కుమారుడికి రెండేళ్ల వయసున్నప్పుడు ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్‌ బాటపట్టాడు.

Updated : 09 May 2023 08:07 IST

రహదారి ప్రమాదంలో బాలుడి మృతి
జగిత్యాలలో విషాదం

జగిత్యాల, న్యూస్‌టుడే: ఆ తండ్రి తన కుమారుడికి రెండేళ్ల వయసున్నప్పుడు ఉపాధి వెతుక్కుంటూ గల్ఫ్‌ బాటపట్టాడు. దాదాపు పదేళ్లపాటు ఇంటి ముఖం చూడలేదు. పిల్లల బాగోగులు ఫోన్లో మాట్లాడి తెలుసుకోవడం తప్పితే.. దగ్గరుండి ప్రేమ పంచలేకపోతున్నాని మథనపడేవారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు ఇంటికి బయలుదేరాడు. కుటుంబసభ్యులు ఎయిర్‌పోర్టుకు రావడంతో సంబరపడ్డాడు. పిల్లల్ని చూసి అప్పుడే ఎంత పెద్దయిపోయారని ఆప్యాయంగా హత్తుకున్నాడు. అంతా ఇంటికి చేరిన కొన్ని గంటల్లోనే ఆయన సంతోషం ఆవిరైంది.

నీటి డబ్బా తీసుకొస్తానని ద్విచక్రవాహనంపై వెళ్లిన కొడుకు విగతజీవిగా తిరిగిరావడంతో బోరుమంటూ కుప్పకూలిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. జగిత్యాల పట్టణంలోని మహాలక్ష్మినగర్‌కు చెందిన చౌట్‌పల్లి మోహన్‌, పద్మిని దంపతులకు కుమార్తె హర్ష, కుమారుడు శివకార్తిక్‌(12) ఉన్నారు. శివకార్తిక్‌ స్థానికంగా ఐదో తరగతి చదువుతున్నాడు. తండ్రి మోహన్‌ ఉపాధి నిమిత్తం పదేళ్ల క్రితమే సౌదీ అరేబియా వెళ్లారు. సోమవారం ఉదయం ఆయన తిరిగి రావడంతో కుటుంబసభ్యులు ఎయిర్‌పోర్టుకు వెళ్లి తోడ్కొని వచ్చారు. ఇంట్లో తాగునీరు అయిపోవడంతో తాను తీసుకొస్తానని శివకార్తిక్‌ ద్విచక్రవాహనంపై వెళ్లాడు. బైపాస్‌ రహదారిలోని దేవిశ్రీ గార్డెన్‌ సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. తీవ్రగాయాలవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని