ఐటీ అధికారులమంటూ లూటీ

సికింద్రాబాద్‌ మార్కెట్‌ ఠాణా పరిధిలో నిత్యం రద్దీగా ఉండే పాట్‌మార్కెట్లో పట్టపగలు జరిగిన దోపిడీ సంచలనం రేకెత్తించింది.

Updated : 28 May 2023 06:03 IST

1700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పరారీ

ఈనాడు, హైదరాబాద్‌, రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ మార్కెట్‌ ఠాణా పరిధిలో నిత్యం రద్దీగా ఉండే పాట్‌మార్కెట్లో పట్టపగలు జరిగిన దోపిడీ సంచలనం రేకెత్తించింది. ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులమంటూ బంగారు దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు పనివాళ్లను గదిలో బంధించి 1,700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పారిపోయారు. ఘటన వివరాలను మహంకాళి ఏసీపీ రమేశ్‌ వెల్లడించారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన రేవన్‌ మధుకర్‌ డాబర్‌ అనే వ్యక్తి దిల్‌సుఖ్‌నగర్‌లో బామ్మర్ది వికాస్‌ కేదేకర్‌తో కలసి బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. నాలుగు నెలల క్రితమే పాట్‌మార్కెట్లోని నవ్‌కార్‌ కాంప్లెక్స్‌లో బాలాజీ గోల్డ్‌షాప్‌ పేరుతో మెల్టింగ్‌ కార్ఖానా ప్రారంభించారు. మూడు రోజుల క్రితం మధుకర్‌ సొంతూరు వెళ్లగా బామ్మర్ది దిల్‌సుఖ్‌నగర్‌ దుకాణంలో ఉంటున్నారు. శనివారం ఉదయం పాట్‌మార్కెట్లోని దుకాణంలోకి ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఐటీ అధికారులమంటూ గుర్తింపుకార్డులు చూపారు.

పనివాళ్ల వద్ద నుంచి 100 గ్రాముల బరువు గల 17 బంగారం బిస్కెట్లు తీసుకున్నారు. యజమానితో మాట్లాడాలని చెప్పినా వినకుండా వారి సెల్‌ఫోన్లు లాక్కొన్నారు. అందరిని గదిలోకి నెట్టి బయట గడియవేసి పారిపోయారు. అనుమానం వచ్చిన కార్మికులు బిగ్గరగా కేకలు వేయడంతో పక్క దుకాణాల వారొచ్చి గడియ తీశారు. విషయం యజమానికి చెప్పడంతో ఆయన బామ్మర్ది కేదేకర్‌ వచ్చి మార్కెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర మండలం డీసీపీ చందనాదీప్తి, ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దుండగులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బంగారం చేతికి అందగానే కొంతదూరం నడుచుకుంటూ వెళ్లి ఆటోలో జేబీఎస్‌కు వెళ్లినట్లు సీసీ ఫుటేజీ, చరవాణి సిగ్నళ్ల ఆధారంగా గుర్తించారు. వీరంతా మహారాష్ట్రకు చెందిన కేటుగాళ్లు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని