Vijayawada: ‘బాబాయ్‌ బాగున్నావా’ అంటూ రూ.80 వేలు టోకరా

బాబాయ్‌ బాగున్నావా అంటూ ఆప్యాయత ఒలకబోసి ఓ మోసగాడు రూ.80 వేలు కొట్టేశాడు.

Published : 03 Jul 2023 09:52 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: బాబాయ్‌ బాగున్నావా అంటూ ఆప్యాయత ఒలకబోసి ఓ మోసగాడు రూ.80 వేలు కొట్టేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంటా రాజేశ్వరరావు కానూరు డీఎన్‌ఆర్‌ కాలనీ నివాసి. ఇతను రైల్వేలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.

శనివారం సాయంత్రం స్థానిక నారాయణ పాఠశాల వద్ద ఉన్న సిమెంటు బెంచిపై కూర్చొని ఉండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ‘బాబాయ్‌ బాగున్నావా.. పిన్ని బాగుందా’ అంటూ పలకరించాడు. తాను బంధువునని, వృద్ధాప్యం కారణంగా నన్ను గుర్తుపట్టలేకపోతున్నావంటూ మాటామాటా కలిపాడు. నిజమని నమ్మిన రాజేశ్వరరావు ఇంటికి తీసుకెళ్లి భార్యకు పరిచయం చేసి కాఫీ ఇచ్చి మర్యాద చేశారు. తన కుమార్తెకు ఆదివారం ఆటోనగర్‌ గేటు వద్ద ఉన్న ఓ కల్యాణ మండపంలో ఓణీల ఫంక్షన్‌ నిర్వహిస్తున్నానని ఇద్దరూ వచ్చి ఆశీర్వదించాలని సదరు వ్యక్తి కోరాడు.

అనంతరం తన వద్ద రూ.80 వేల రూ.2 వేల నోట్లు ఉన్నాయని తనకు దీనికి సరిపడా రూ.500 నోట్లు ఇవ్వాలని కోరాడు. దీంతో రాజేశ్వరరావు రూ.80 వేల విలువ చేసే రూ.500 నోట్లు ఇచ్చాడు. అనంతరం తాను ఇవ్వాల్సిన నగదును ఏటీఎంలో డ్రా చేసి ఇస్తానని రాజేశ్వరరావును బైక్‌పై ఎక్కించుకొని కామయ్యతోపు వద్దకు తీసుకొచ్చి అక్కడ దింపాడు. నగదు డ్రా చేసి తెస్తానని, అంతదాకా ఇక్కడే వేచి ఉండమని చెప్పివెళ్లాడు. ఎన్ని గంటలైనా తిరిగిరాకపోవడం, జాడ తెలీకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి ఆదివారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని