Vizianagaram-Train Accident: రైలు పట్టాలపై ఘోరం

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ట్రాక్‌పై ఉన్న రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొన్న దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జయి 14 మంది దుర్మరణం చెందారు.

Updated : 30 Oct 2023 09:10 IST

ఒకే ట్రాక్‌పై ముందున్న రైలును వెనుక నుంచి ఢీకొన్న మరో రైలు
పక్క ట్రాక్‌లోని గూడ్సుపైకీ దూసుకెళ్లి మరింత బీభత్సం 
14 మంది మృతి.. 100 మందికిపైగా గాయాలు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
విజయనగరం జిల్లాలో విషాదం
చీకట్లతో సహాయ చర్యలకు ఆటంకం
ప్రధాని మోదీ ఆరా.. సహాయ చర్యలకు సీఎం జగన్‌ ఆదేశం
బాలేశ్వర్‌ ప్రమాదం తరహాలోనే సిగ్నల్‌ సమస్య!

ఈనాడు-విజయనగరం, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తవలస మండలం కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో ట్రాక్‌పై ఉన్న రైలును వెనకనుంచి మరో రైలు ఢీకొన్న దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జయి 14 మంది దుర్మరణం చెందారు. 33 మందికి గాయాలయ్యాయని అధికార వర్గాలు ప్రకటించాయి. క్షతగాత్రుల సంఖ్య వంద మందికిపైనే ఉంటుందని సంఘటన స్థలంలో పరిస్థితులనుబట్టి తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు బయలుదేరిన విశాఖపట్నం-పలాస (08532) రైలును వెనుక నుంచి కొద్ది నిమిషాల తేడాతో ప్రారంభమైన విశాఖపట్నం-రాయగడ (08504) రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రాయగడ రైల్లోని బోగీలు నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని పట్టాలు తప్పాయి.

అక్కడే మరో ట్రాక్‌పైనున్న గూడ్సు రైలు బోగీలపైకి అవి దూసుకెళ్లాయి. దీంతో ఇక్కడ భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారుచీకట్లు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కంటకాపల్లి-అలమండ వద్దకు రాగానే సిగ్నల్‌ కోసం పలాస ప్యాసింజర్‌ పట్టాలపై నెమ్మదిగా వెళుతూ 848 కి.మీ.వద్ద ట్రాక్‌పై నిలిచింది. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టినట్లు అందులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్‌ రైలు ప్రమాద సంఘటన మాదిరిగానే ఈ ప్యాసింజర్‌ రైళ్ల ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. పలాస గార్డు బోగీని రాయగడ ఇంజిను ఢీకొట్టడంతో ఆ రెండు నుజ్జయ్యాయి. ఈ వేగానికి రాయగడ బోగీలు ఏకంగా అదే రైలు ఇంజినుపైకి దూసుకెళ్లాయి. అదే సమయంలో పక్కన గూడ్సు రైలు వెళుతోంది.

ప్రమాదం జరిగినప్పుడు రాయగడ రైలుకు చెందిన కొన్ని బోగీలు గూడ్సు రైలును ఢీకొన్నాయి. రెండు ప్యాసింజర్‌, గూడ్సు రైళ్లలో కలిపి ఏడు బోగీలు నుజ్జయ్యాయి. ట్యాంకర్‌ గూడ్సుపైకి పలాస రైలుకు చెందిన రెండు బోగీలు దూసుకెళ్లడంతో పట్టాలు పైకి లేచి, దానికింద తలకిందులుగా రైలు దూసుకెళ్లిన తీరు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. వెనుక నుంచి ఢీకొట్టిన రాయగడ రైలు ఇంజినుపైకి ఆ రైలు బోగీలే మూడు పైకెక్కి, పక్కనే ఉన్న బొగ్గు రవాణా గూడ్సు రైలును ఢీకొన్నాయి. విశాఖ-రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడింది. దాని వెనుక ఉన్న డీ-1 బోగి వేగానికి కొంత భాగం విరిగి పైకి లేచింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు అందించడం సవాలుగా మారింది.

భారీగా మృతుల సంఖ్య?

పలాస, రాయగడ ప్యాసింజర్‌ రైళ్లలో సుమారు 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా ప్రాంతంలో సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది అంచనా ప్రకారం మృతుల సంఖ్య 40-50 వరకు ఉంటుందని సమాచారం. అర్ధరాత్రి వరకు 10 మంది మృతదేహాలను వెలికితీశారు. వీరిలో కొందరినే గుర్తించారు. ప్రయాణికులతో ఉన్న బోగీలు అదుపుతప్పడం, రెండుగా అవి చీలిపోయి నుజ్జునుజ్జవ్వడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విజయనగరం జిల్లా జామి మండలం గుడికొమ్ముకు చెందిన కె.రవితోపాటు, గరివిడి మండలం కాపుశంభం గ్రామానికి చెందిన పెరుమజ్జి గౌరీనాయుడు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఎస్‌పీఆర్‌ పురానికి చెందిన గిడిజాల లక్ష్మి (40) మృతదేహాలను గుర్తించారు. పలాస రైల్లో వెనుక బోగీ ఆనుకుని ఉన్న గార్డు ఎంఎస్‌ రావు, రాయగడ రైలు ఇంజినులో ఉన్న లోకో పైలెట్లు ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది.

అతికష్టంగా సహాయ చర్యలు

విజయనగరం-కొత్తవలస ప్రధాన రహదారికి దుర్ఘటన స్థలి 5 కి.మీ.పైగా దూరం ఉండటంతో అన్ని రకాల సహాయ చర్యలు కష్టమవుతున్నాయి. ఎన్‌డీఆర్‌ఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయచర్యలు చేపట్టాయి. నుజ్జుయిన బోగీల నుంచి మృతదేహాలను బయటకు తీయడానికి కట్టర్లు ఉపయోగించారు. క్షతగాత్రులను తరలించడానికి రైలు ట్రాక్‌పై కి.మీ.మేర దూరం నడిచి అంబులెన్సులలో ఎక్కించాల్సి వస్తోంది. క్షతగాత్రులు, మృతదేహాలతో ప్రమాదం జరిగిన ప్రాంతం మరుభూమిని తలపించింది. తీవ్రగాయాలైనవారిని విశాఖ కేజీహెచ్‌కు, స్వల్పగాయాలైనవారిని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలికి మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపికలు చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు.

సిగ్నల్‌ సమస్యా? మానవ తప్పిదమా?

విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్‌పై వెనుకనే విశాఖ నుంచి రాయగడ ప్యాసింజర్‌ 6 గంటలకు బయలుదేరింది. గంట వ్యవధిలోనే ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్లిన పలాస రైలుకు సిగ్నల్‌ సమస్య ఎదురవ్వడంతోనే కంటకాపల్లి నుంచి చాలా నెమ్మదిగా రైలు ట్రాక్‌పై వెళ్లిందని అందులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఈలోగా వెనుకనుంచి వచ్చిన రైలు ఢీకొన్నట్లు వివరిస్తున్నారు. తన 26 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ప్రమాదం ఇదే మొదటిసారి అని, ఒకే ట్రాక్‌లో సిగ్నల్‌ క్రాస్‌ కాకుండా రెండు రైళ్లను ఎలా పంపించారనేది అంతుపట్టడం లేదని ప్రమాదం జరిగిన రైల్లో ప్రయాణించిన ఒక రైల్వే ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రమాదం తరువాత సహాయక చర్యలు చేపట్టిన యంత్రాంగం...అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బొగ్గు రవాణా రైలు, ట్యాంకరు రైలును ఆ ప్రాంతం నుంచి తరలించారు. అలాగే పలాస రైలులో ప్రమాదానికి గురైన బోగీలు మినహాయించి మిగిలిన బోగీలను తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో వస్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను కంటకాపల్లిలో నిలిపివేశారు. ఆయా రైళ్లలో  ప్రయాణికులను రోడ్డు మార్గంలో తరలించారు.

నేడు పలు రైళ్ల రద్దు..: రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం కూడా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కోర్బా-విశాఖపట్నం, పారదీప్‌-విశాఖపట్నం, రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం, విశాఖపట్నం-గుణుపూర్‌, గుణుపూర్‌-విశాఖపట్నం, విజయనగరం-విశాఖపట్నం రైళ్లు రద్దయ్యాయి.

మృతుల కుటుంబాలకు ప్రధాని రూ.2లక్షల చొప్పున సాయం

ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులందరినీ తరలించినట్లు అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌’లో తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితోనూ ప్రధాని మాట్లాడారని, రైల్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన వివరించారు.


ఏపీకి చెందిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు

క్షతగాత్రులకు రూ.2 లక్షలు
సాయం ప్రకటించిన సీఎం జగన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రైలు ప్రమాదంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.రైలుప్రమాదంలో మృతిచెందిన ఏపీకి చెందినవారి కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇతర రాష్ట్రాలవారు మరణిస్తే రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. ఘటన గురించి రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌తో ఆదివారం రాత్రి ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఘటనాస్థలికి మంత్రి బొత్స సత్యనారాయణను పంపామని, ప్రమాద విషయం తెలియగానే సహాయకబృందాలు అక్కడకు చేరుకున్నాయని వివరించారు. సహాయక చర్యల్ని స్థానిక కలెక్టర్‌, ఎస్పీ పర్యవేక్షిస్తున్నారని, క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు.


తెదేపా కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనాలి
- పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, లోకేశ్‌ పిలుపు

ఈనాడు, అమరావతి: రైలు ప్రమాదంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందేలా చూడాలని కోరారు. సహాయ చర్యల్లో పాల్గొనాలని స్థానిక తెదేపా శ్రేణులకు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు.


సమగ్ర విచారణ చేపట్టాలి: పవన్‌

రైలు ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే అధికారులను జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కోరారు.  ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని జనసేన నాయకులు, జన సైనికులకు విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని