Nizamabad: ఆస్తి కోసం ఆరుగురి హత్య

వారిద్దరు ప్రాణస్నేహితులు.. కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకునేవారు. స్నేహితులంటే ఇలాగే ఉండాలన్నట్టుగా మెలిగేవారు. అలాంటిది.. అందులో ఒకరి ఆస్తిని కాజేయాలని మరొకరిలో పుట్టిన దురాశ ఆరుగురి హత్యలకు దారితీసింది.

Updated : 19 Dec 2023 09:49 IST

ప్రాణస్నేహితుడి కుటుంబంపైనే కిరాతకం
16 రోజుల్లో ఒకరి తర్వాత మరొకర్ని హతమార్చిన నిందితుడు
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఘోరం

ఈనాడు-కామారెడ్డి, న్యూస్‌టుడే-మాక్లూర్‌: వారిద్దరు ప్రాణస్నేహితులు.. కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకునేవారు. స్నేహితులంటే ఇలాగే ఉండాలన్నట్టుగా మెలిగేవారు. అలాంటిది.. అందులో ఒకరి ఆస్తిని కాజేయాలని మరొకరిలో పుట్టిన దురాశ ఆరుగురి హత్యలకు దారితీసింది. 16 రోజుల్లో ఒకరి తర్వాత ఒకర్ని.. ఒక్కోచోట నిందితుడు హతమార్చాడు. తెలిసిన వివరాల ప్రకారం.. ఉమ్మడి నిజామాబాద్‌ (Nizamabad) జిల్లా మాక్లూర్‌ మండల కేంద్రానికి చెందిన ప్రసాద్‌(33), ప్రశాంత్‌(30) ప్రాణస్నేహితులు. సుమారు రూ.25 లక్షలు ఉండే ప్రసాద్‌ ఆస్తిపై ప్రశాంత్‌ కన్నేశాడు. దాన్ని దక్కించుకునేందుకు ప్రసాద్‌ను, అతడి భార్య రమణి(30), వారి కవల పిల్లలు చైత్రిక్‌(7), చైత్రిక(7), ప్రసాద్‌ చెల్లెళ్లు స్వప్న(27), స్రవంతి(24)లను హత్య చేశాడు.

అప్పు ఇప్పిస్తాడనుకుంటే..

ఓ యువతి ఆత్మహత్యకు కారకుడయ్యాడన్న నెపంతో ప్రసాద్‌ కుటుంబంపై ఊరిపెద్దలు గ్రామ బహిష్కరణ విధించారు. దీంతో స్థానికంగా ఉపాధి లభించలేదు. అప్పులు చేసి.. గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై బయటకొచ్చాడు. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో అప్పు ఇప్పిస్తాడని ప్రశాంత్‌ను ఆశ్రయించాడు. తనకున్న రెండిళ్లను అతడి పేరిట బదలాయించాడు. చెప్పిన గడువులోపు ప్రశాంత్‌ అప్పు ఇప్పించలేదు. ఇళ్లను తిరిగి ప్రసాద్‌ పేరిట బదలాయించడంలోనూ జాప్యం చేశాడు. దీనిపై ప్రశ్నిస్తే దాటవేస్తూ వచ్చాడు. దీంతో పెద్దమనుషుల వద్ద ప్రసాద్‌ పంచాయితీ పెట్టాడు. అంతకుముందే మాక్లూర్‌ నుంచి కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రానికి ప్రసాద్‌ కుటుంబం సహా మకాం మార్చాడు. అతడు స్థానికంగా నివాసం ఉండకపోవడంతో.. ఇళ్లను అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని ప్రశాంత్‌ పన్నాగం పన్నాడు. ప్రసాద్‌ కుటుంబం ఉన్నంతకాలం ఇళ్లను విక్రయించడం సాధ్యం కాదని భావించి.. వారిని అడ్డు తొలగించేందుకు పథకం రచించాడు. మొదట ప్రసాద్‌ను నవంబరు 28న ఇంటి నుంచి తీసుకెళ్లి డిచ్‌పల్లి శివారులో హత్య చేసి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. అతన్ని నిర్మల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని.. విడిపించుకు రావాలంటూ ప్రసాద్‌ భార్య రమణిని కారులో ఇంటి నుంచి తీసుకెళ్లాడు. ఆమెను బాసర వద్ద గోదావరి నదిలోకి తోసి హతమార్చాడు. ప్రసాద్‌, రమణిలను బాసర వద్ద అద్దె గదిలో ఉంచానని చెప్పి.. ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకెళ్లాడు. బాల్కొండ సమీపంలోని సోన్‌ వద్ద వారి మృతదేహాలు కాలిన స్థితిలో లభించాయి. ఆ తర్వాత దివ్యాంగురాలైన ప్రసాద్‌ పెద్ద చెల్లెలు స్వప్నను తీసుకెళ్లి.. మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం సమీపంలో కల్వర్టు వద్ద హత్య చేశాడు. మృతదేహాన్ని తగులబెట్టాడు. చిన్న చెల్లెలు స్రవంతిని కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం భూంపల్లి వద్దకు తీసుకెళ్లి హత్య చేసి.. మృతదేహాన్ని దహనం చేశాడు.

ఇలా వెలుగులోకి..!

భూంపల్లి వద్ద గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు అందించిన సమాచారంతో సదాశివనగర్‌ పోలీసులు డిసెంబరు 13న కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలించగా.. నిందితుడి వివరాలు బయటపడినట్లు తెలిసింది. అప్పటికే ఆరుగురిని అంతమొందించిన ప్రశాంత్‌.. ప్రసాద్‌ తల్లి సుశీలను సైతం హతమార్చాలనుకున్నాడు. అతడిని పోలీసులు పట్టుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.

పోలీసుల అదుపులో అనుమానితులు?

కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రశాంత్‌ను అదుపులో తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. హత్యలకు మరికొందరు సహకరించినట్లు నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరికొందరు సైతం హత్యల్లో పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వరుస హత్యలపై వారు అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని