YSRCP: వైకాపా నేత కుమారుడి రేవ్‌ పార్టీ కోసమే డ్రగ్స్‌!

ఏపీలోని నెల్లూరు జిల్లా వైకాపా నాయకుడి కుమారుడు పుట్టినరోజున ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీ కోసమే గోవా నుంచి డ్రగ్స్‌ హైదరాబాద్‌ తీసుకొచ్చినట్టు టీఎస్‌న్యాబ్‌ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

Updated : 26 Dec 2023 09:29 IST

గోవా నుంచి తీసుకొచ్చినట్లు గుర్తింపు
ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన టీఎస్‌ న్యాబ్‌ పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీలోని నెల్లూరు జిల్లా వైకాపా నాయకుడి కుమారుడు పుట్టినరోజున ఏర్పాటు చేసిన రేవ్‌ పార్టీ కోసమే గోవా నుంచి డ్రగ్స్‌ హైదరాబాద్‌ తీసుకొచ్చినట్టు టీఎస్‌న్యాబ్‌ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇటీవల ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలోని అమీర్‌పేట మైత్రివనంలో పోలీసులు ఎక్సటసీ పిల్స్‌ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా అక్కడ నిర్వహించిన పార్టీలో డ్రగ్స్‌ వాడినట్టు నిర్ధారించారు. ఈ కేసులో అరెస్టైన నెల్లూరు జిల్లాకు చెందిన ప్రధాన నిందితులు ఆశిక్‌యాదవ్‌, రాజేశ్‌.. గోవాకు చెందిన బాబా అనే వ్యక్తి వద్ద 60 ఎక్సటసీ పిల్స్‌ కొనుగోలు చేసినట్టు తేల్చారు. గోవా వెళ్లిన టీఎస్‌న్యాబ్‌ పోలీసుల బృందం నాలుగురోజులు కాపుగాసి పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాబా అసలు పేరు హనుమంత్‌బాబూ సో దివ్కర్‌(50). ఎక్సటసీ పిల్స్‌ ఒక్కోటి రూ.1,000-1,200 ధరకు హైదరాబాద్‌లో పెడ్లర్లకు విక్రయిస్తాడని టీఎస్‌న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య సోమవారం తెలిపారు. నిందితుడిని అరెస్టుచేసి 60 పిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ఇతడివద్ద ఫిల్మ్‌నగర్‌లోని శాంచురీ పబ్‌ డీజే ఆపరేటర్‌ స్వదీప్‌ 14 గ్రాముల కొకైన్‌ కొనుగోలు చేసి రూ.1.4లక్షలు ఇచ్చినట్టు నిర్ధారించారు. బాబా వద్ద డ్రగ్స్‌ కొనుగోలు చేసేవారి జాబితాలో నగరానికి చెందిన 25 మంది ఉన్నట్టు గుర్తించారు.

ముగ్గురు వాడినట్టు నిర్ధారణ

రేవ్‌ పార్టీలో ఏపీ నెల్లూరు జిల్లా, హైదరాబాద్‌కు చెందిన 33 మంది పాల్గొన్నట్టు పోలీసులు తేల్చారు. వీరిలో 12 మందికి నోటీసులు జారీచేశారు. ఇప్పటి వరకు డ్రగ్స్‌ పరీక్ష నిర్వహించిన వారిలో ముగ్గురు మాదకద్రవ్యాలు వినియోగించినట్టు నిర్ధారణ అయింది. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 87126 71111 వాట్సప్‌ నంబరుకు సమాచారం అందజేయాలని టీఎస్‌న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌శాండిల్య కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని