AP News: ‘అంతుచూస్తాం.. బతకనివ్వం’ అంటూ హెచ్చరిస్తున్నారు

వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు క్షమాపణ చెప్పకపోతే ‘అంతు చూస్తాం... మాకు కనిపిస్తే బతకనివ్వం’ అంటూ తనను హెచ్చరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని,....

Updated : 29 Sep 2021 07:07 IST

సామాజిక మాధ్యమాల్లో  నాపై అసభ్యకర పోస్టులు

డీజీపీకి.. తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు క్షమాపణ చెప్పకపోతే ‘అంతు చూస్తాం... మాకు కనిపిస్తే బతకనివ్వం’ అంటూ తనను హెచ్చరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌.. రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి పట్టాభి మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఈ ఫిర్యాదును అందించారు. తనపై దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని, వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని పట్టాభి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై విష ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ‘సామినేని ఉదయభాను రెండో కుమారుడు ప్రశాంత్‌ వ్యవహారశైలిపై మీడియా ముందుకు వాస్తవాలు తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యే అనుచరులు సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారు. యర్రమాసు రామకృష్ణ, జోన్స్‌ పణితి, తదితరులు నాపైనా, నా కుటుంబ సభ్యులపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. పట్టాభిరామ్‌కు శ్రద్ధాంజలి అంటూ పోస్టులు పెడుతున్నారు. వీటిని చూసి మా బంధువులు, కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జగ్గయ్యపేట వైకాపా సంగతి తెలుసుగా అని హెచ్చరిస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారు...’ అని ఆ ఫిర్యాదులో పట్టాభి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు