Crime News: దొంగ తెలివి.. మహిళ తెగువ

కిరాణా దుకాణం నిర్వహిస్తున్న మహిళ కళ్లలో కారం కొట్టి మెడలోని మంగళసూత్రం లాక్కెళ్తున్న ఓ దుండగుడిని మరో వనిత సాయంతో పట్టుకొన్న ఘటన జిల్లా కేంద్రంలోని శివాజీరోడ్డు చౌరస్తాలో శుక్రవారం చోటు 

Updated : 25 Dec 2021 07:16 IST

చోరీకి యత్నించి స్థానికుల చేతికి చిక్కిన యాదగిరి

కామారెడ్డి నేరవిభాగం, న్యూస్‌టుడే: కిరాణా దుకాణం నిర్వహిస్తున్న మహిళ కళ్లలో కారం కొట్టి మెడలోని మంగళసూత్రం లాక్కెళ్తున్న ఓ దుండగుడిని మరో వనిత సాయంతో పట్టుకొన్న ఘటన జిల్లా కేంద్రంలోని శివాజీరోడ్డు చౌరస్తాలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. కాలనీలో కృష్ణమూర్తికి చెందిన కిరాణా దుకాణాన్ని ఆయన భార్య తెరుస్తుండగా.. ఓ గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై శిరస్త్రాణం ధరించి వచ్చాడు. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి డబ్బులు తీస్తున్నట్లు నమ్మించి చిప్స్‌ ప్యాకెట్‌ కావాలని అడిగాడు. సదరు మహిళ తీసిచ్చేలోగా కారం పొడి తీసి కళ్లలో చల్లాడు. వెంటనే ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడును తెంపుకొని ద్విచక్రవాహనంపై ఉడాయించబోయాడు. అంతలోనే అదే కాలనీకి చెందిన భారతి అనే మహిళ దుకాణంలో వస్తువుల కొనుగోలుకు వచ్చారు. తన కళ్ల ముందు జరుగుతున్న చోరీని గమనించారు. వెంటనే తేరుకొని కిందపడ్డ కారంపొడి పొట్లం తీసుకొని అతడి కళ్లలోనే కొట్టి కేకలు వేశారు. స్థానికులు చేరుకొని దొంగకు దేహశుద్ధి చేశారు. దొంగతనానికి యత్నించిన వ్యక్తి సదాశివనగర్‌ మండల కేంద్రంలో నివాసముండే మ్యాదరి యాదగిరిగా గుర్తించారు. కౌన్సిలర్లు కోయల్కర్‌ కన్నయ్య, పిట్ల వేణుగోపాల్‌ చేరుకొని పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై పట్టణ సీఐ మధుసూదన్‌ను వివరణ కోరగా.. యాదగిరికి మతిస్థిమితం సరిగాలేకపోవడంతో అలా ప్రవర్తించాడని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని