TS News:సాయం చేద్దామని వెళ్లి..బావిలో పడి యువకుడి మృతి

నూతన సంవత్సర వేడుకలు ఓ ఇంట్లో విషాదాన్ని మిగిల్చాయి. సాయం చేయడానికి వెళ్లిన యువకుడు ఇతరుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో బావిలో పడి మృతిచెందాడు.

Updated : 02 Jan 2022 09:34 IST

కళ్లెం రమేష్‌

బీబీనగర్‌, న్యూస్‌టుడే: నూతన సంవత్సర వేడుకలు ఓ ఇంట్లో విషాదాన్ని మిగిల్చాయి. సాయం చేయడానికి వెళ్లిన యువకుడు ఇతరుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో బావిలో పడి మృతిచెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలంలో శనివారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఎస్సై రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా తుప్రాన్‌ మండలం వెంకటాపురానికి చెందిన కళ్లెం శ్రీనివాస్‌, మంగమ్మ దంపతులు హైదరాబాద్‌ నాచారం డివిజన్‌ పరిధి మల్లాపూర్‌ ఇందిరమ్మ కాలనీలో నివాసముంటూ కూలి పనులు చేస్తున్నారు. వీరి పెద్దకుమారుడు రమేష్‌ (21) ఇంట్లో తెలియకుండా స్థానిక స్నేహితులతో కలిసి శనివారం తెల్లవారుజామున రెండు ద్విచక్ర వాహనాలపై యాదాద్రికి బయలుదేరారు. మార్గంమధ్యలో గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఓ హోటల్‌లో ఆగి టీ తాగారు. అప్పటికే అక్కడ గూడూరుకు చెందిన యువకులతో గొడవపడిన భువనగిరికి చెందిన యువకులు ద్విచక్ర వాహనంలో పెట్రోల్‌ అయిపోయి ఇబ్బందులు పడుతున్నారు. గొడవ విషయం తెలియని రమేష్‌, తన మిత్రులతో కలిసి వారికి సాయం చేస్తుండగా గూడూరు వాసులు గుంపుగా వచ్చి కర్రలతో దాడికి పాల్పడ్డారు. తప్పించుకునే క్రమంలో రమేష్‌  ధాబాల వెనక ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు. గమనించిన స్నేహితుడు రాఘవ బీబీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇవ్వడంతో పోలీసులు 6 గంటల పాటు శ్రమించి రమేష్‌ మృతదేహం వెెలికితీశారు. ఈత రాక యువకుడు మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గూడూరుకు చెందిన ఏడుగురు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేందర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని