Suicide:పెద్దలను ఒప్పించలేక.. విడిపోయి బతకలేక..

పెద్దల్ని ఒప్పించే ధైర్యం చేయలేక.. చావుతో ఒకటైన ప్రేమజంట ఒకచోట..పెద్దలు అంగీకరించక..ఒకరికి దూరంగా  మరొకరు ఉండలేక..కలసి ‘ఉరి’నే వరించిన జంట మరోచోట..సంగారెడ్డి, కుమురం భీం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటలు చేజేతులా ప్రాణాలు తీసుకున్నాయి.. కన్నవారికి కడుపు కోతను మిగిల్చాయి.. 

Updated : 04 Jan 2022 06:45 IST

ప్రేమ జంటల బలవన్మరణం

వికారాబాద్‌, కుమురం భీం జిల్లాల్లో విషాదం

మునిపల్లి, వాంకిడి, న్యూస్‌టుడే

శివ, అమృత

పెద్దల్ని ఒప్పించే ధైర్యం చేయలేక.. చావుతో ఒకటైన ప్రేమజంట ఒకచోట.. పెద్దలు అంగీకరించక.. ఒకరికి దూరంగా  మరొకరు ఉండలేక.. కలసి ‘ఉరి’నే వరించిన జంట మరోచోట.. సంగారెడ్డి, కుమురం భీం జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటలు చేజేతులా ప్రాణాలు తీసుకున్నాయి.. కన్నవారికి కడుపు కోతను మిగిల్చాయి.. 

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం సిరిపురానికి చెందిన బేగరి శివ(22), సంగారెడ్డి జిల్లా కోహీర్‌ పట్టణానికి చెందిన బొగ్గుల అమృత(20) దూరపు బంధువులు. శివ సంగారెడ్డిలో బీఫార్మసీ, అక్కడే అమృత మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు చదువుతున్నారు. వీరి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. ఇంట్లో పెద్దలకు చెప్పి.. పెళ్లికి ఒప్పించే ధైర్యం చేయలేక, విడిగా బతకలేక ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని సూసైడ్‌ నోట్‌లో రాశారు. ఆదివారం రాత్రి బుధేరాలో జనసంచారం లేని ప్రదేశానికి వెళ్లారు. రాత్రి 8గంటలకు శివ తన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెప్పి స్విచ్చాఫ్‌ చేశాడు. ఆపై ఒకే చెట్టుకు ఇద్దరూ ఉరేసుకొని మరణించారు. శివ కుటుంబ సభ్యులు బుధేరా చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు సంఘటన స్థలం నుంచి ఆత్మహత్య లేఖ, ఆధార్‌ కార్డులు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రేమజంట అందించిన సమాచారాన్ని తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేసిఉంటే, ఇంత ఘోరం జరిగేది కాదని, సెల్‌ఫోన్‌ నంబర్‌ ఆధారంగా లోకేషన్‌కు చేరుకునే వీలుండేదని సదాశివపేట గ్రామీణ సీఐ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.


అంగీకారం ఒకరిది.. తిరస్కారం మరొకరిది

శ్రీకాంత్‌, గీత

కుమురం భీం జిల్లా వాంకిడిలోని రాంనగర్‌ కాలనీకి చెందిన నౌగడె శ్రీకాంత్‌ (22), ఎల్ములె గీత అలియాస్‌ శ్యామల(20) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్‌ తల్లిదండ్రులు పెళ్లికి సిద్ధంగా ఉండగా, గీత తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌ 27న ఇరువురు ఇళ్లు విడిచి పోయారు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం ఆకిని గ్రామ శివారులోని పత్తిచేనులో ఉన్న చెట్టుకు వేలాడుతూ విగతజీవులై కనిపించారు. దుర్వాసన వస్తుండడంతో మూడు రోజుల కిందటే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శ్రీకాంత్‌ చదువుకోలేదు. గీత తొమ్మిదో తరగతి చదివింది. ఇద్దరూ తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ పనులు చేస్తుండేవారు. అనూహ్య ఘటనతో ఇరువురి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గీత తల్లిదండ్రులు సవిత-రవీందర్‌ల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సుధాకర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని