Crime News: బెంగళూరు కేంద్రంగా రుణయాప్‌ల కాల్‌సెంటర్‌

పూచీకత్తు లేకుండా రుణాలిస్తామంటూ ఎర వేసి ఆ తర్వాత బాధితులను వేధించి రూ.లక్షలు దండుకుంటున్న రుణయాప్‌ల పాత్రధారులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బెంగళూరులో

Published : 10 Mar 2022 08:45 IST

ఇద్దరు నిందితులు.. వంద మంది టెలీకాలర్ల అరెస్టు

ఈనాడు, హైదరాబాద్‌: పూచీకత్తు లేకుండా రుణాలిస్తామంటూ ఎర వేసి ఆ తర్వాత బాధితులను వేధించి రూ.లక్షలు దండుకుంటున్న రుణయాప్‌ల పాత్రధారులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బెంగళూరులో స్కైలింక్‌ టెక్నాలజీ కాల్‌సెంటర్‌పై దాడి చేసి షబ్బీర్‌ ఆలం, ఉమాకాంత్‌యాదవ్‌లతోపాటు వంద మంది టెలీకాలర్లను అరెస్టు చేశామని సంయుక్త కమిషనర్‌(నేర పరిశోధన) గజరావ్‌ భూపాల్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. హాంకాంగ్‌లో ఉన్న చైనీయుడు షెన్‌ చెన్‌పింగ్‌ సూచనలతో షబ్బీర్‌, ఉమాకాంత్‌లు బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో కొన్ని నెలల నుంచి కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్నారని, రుణాలిచ్చేందుకు వీరు 40 యాప్‌లను సృష్టించారన్నారు. మొత్తం 221 రుణయాప్‌లు ఉన్నాయని.. వీటిని ప్లేస్టోర్‌ నుంచి తొలగించాలంటూ గూగుల్‌ యాజమాన్యానికి లేఖలు రాశామని తెలిపారు.

రుణం తిరిగి చెల్లించకపోతే అంతే..

యాప్‌ల ద్వారా రుణాలిస్తామంటూ సామాజిక మాధ్యమాలు, వాట్సప్‌లలో షబ్బీర్‌, ఉమాకాంత్‌లు ప్రచారం చేయిస్తున్నారు. సెల్‌ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌, ఫొటోలు ఇవ్వాలని రుణం కోసం సంప్రదిస్తున్నవారికి షరతు విధిస్తున్నారు. తీసుకున్న వారం రోజుల్లోనే వడ్డీతోసహా అప్పు చెల్లించాలి. చెల్లించకపోతే బాధితులను మానసికంగా వేధిస్తున్నారు. బాధితుల కుటుంబసభ్యులు, స్నేహితులకు.. అప్పు తీసుకున్న వారి ఫొటోలను పంపించి.. ఆ ఫొటోల కింద అసభ్య వ్యాఖ్యలు జోడిస్తున్నారు. శ్రద్ధాంజలి అంటూ వారి ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. టెలీకాలర్లతో అసభ్యంగా తిట్టిస్తున్నారు.

షెన్‌ చెన్‌పింగ్‌పై రెడ్‌కార్నర్‌ నోటీసు..  

రుణయాప్‌ల కంపెనీ, కాల్‌సెంటర్‌ సృష్టికర్త షెన్‌ చెన్‌పింగ్‌పై రెడ్‌కార్నర్‌ నోటీసు జారీకి చర్యలు తీసుకుంటామని గజరావ్‌ భూపాల్‌ తెలిపారు. బెంగళూరులో రెండేళ్ల క్రితం గోల్డెన్‌ బ్యాగ్‌ టెక్నాలజీస్‌ పేరుతో షెన్‌ చెన్‌పింగ్‌ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశాడని.. తాము ఇతర రుణయాప్‌ల కాల్‌సెంటర్లపై దాడులు నిర్వహించేసరికి చైనాకు పారిపోయాడని చెప్పారు. అక్కడి నుంచే షబ్బీర్‌ ఆలంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడని తెలిపారు. చెన్‌పింగ్‌ సూచనలతో షబ్బీర్‌, ఉమాకాంత్‌లు కొన్ని నెలల క్రితం కాల్‌సెంటర్‌ ప్రారంభించారని వివరించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని బెంగళూరు వెళ్లి నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 9 సెల్‌ఫోన్లు, 63 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని