Andhra News: బాధితులనే ఠాణాకు పిలిపించి.. ఆపై చితకబాది!

ఇరుగు పొరుగు వివాదంలో నెల రోజుల క్రితం కోర్టులో ఫిర్యాదుచేసిన తమను తాజాగా స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. ‘రాత్రి అయ్యింది ఇంటికి పంపించండి’ అన్న పాపానికి చితకబాదారని బాధిత కుటుంబసభ్యులు

Updated : 29 Apr 2022 07:04 IST

ఎస్సైపై ఓ కుటుంబం ఫిర్యాదు

డి.హీరేహాళ్‌ (రాయదుర్గం పట్టణం), న్యూస్‌టుడే: ఇరుగు పొరుగు వివాదంలో నెల రోజుల క్రితం కోర్టులో ఫిర్యాదుచేసిన తమను తాజాగా స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. ‘రాత్రి అయ్యింది ఇంటికి పంపించండి’ అన్న పాపానికి చితకబాదారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. బాధితుడు హేమంత్‌ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని కుమార్తె మీనాక్షి కథనం ప్రకారం.. డి.హీరేహాళ్‌ మండలం మురడి గ్రామానికి చెందిన హేమంత్‌ కుటుంబానికి, పొరుగు వారికి నెల కిందట గొడవ జరిగింది. దీనిపై హేమంత్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు. బుధవారం మధ్యాహ్నం డి.హీరేహాళ్‌ ఎస్సై రామకృష్ణారెడ్డి ఫోన్‌ చేసి స్టేషన్‌కు రావాలని చెప్పారు. ఇప్పుడు రాలేమని, రేపు వస్తామని చెప్పగా కోపోద్రిక్తుడై స్వయంగా గ్రామానికి వచ్చారు. హేమంత్‌ దంపతులతో పాటు వారి కుమారుడు మంజునాథ్‌, కుమార్తె మీనాక్షిలను పోలీసు జీపులో స్టేషన్‌కు తరలించారు. రాత్రి ఏడు గంటల సమయంలో హేమంత్‌.. తాను, తన కుమారుడు ఇక్కడే ఉంటామని, భార్యను, కుమార్తెను పంపించాలని ఎస్సైని కోరారు. ఆగ్రహించిన ఎస్సై మా నాన్నను, అన్నయ్యను లాఠీతో తీవ్రంగా కొట్టారని, అడ్డువస్తే నిన్ను కూడా కాలితో తంతా అని బెదిరించారని మీనాక్షి ఆరోపించారు. స్పృహ కోల్పోయిన తమ తండ్రికి తొలుత రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించామని, మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తీసుకొచ్చామని వివరించారు. తమకు న్యాయం చేయాలని మీనాక్షి వేడుకున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ ఎస్సై రామకృష్ణారెడ్డిని వివరణ కోరగా తాను సెలవులో ఉన్నానని, ప్రస్తుతం మాట్లాడలేనని సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని