Andhra News: మనవళ్ల కోసం వచ్చి అమ్మమ్మ బలి

రాత్రిపూట విద్యుత్తు తీగలు తెగిపడి ఊరంతా భీతావహులై ఇళ్లలోకి పరుగులు తీస్తే.. ఆరుబయట పడుకున్న మనవళ్లు ఏమయ్యారోనని బయటికి వచ్చిన ఓ మహిళ ఆ తీగలు తగిలి సజీవ దహనమయ్యారు. ప్రకాశం జిల్లా కంభం

Updated : 11 May 2022 07:57 IST

విద్యుత్తు తీగలు తెగిపడి సజీవ దహనం
మరో వృద్ధురాలి పరిస్థితి విషమం

కంభం, న్యూస్‌టుడే: రాత్రిపూట విద్యుత్తు తీగలు తెగిపడి ఊరంతా భీతావహులై ఇళ్లలోకి పరుగులు తీస్తే.. ఆరుబయట పడుకున్న మనవళ్లు ఏమయ్యారోనని బయటికి వచ్చిన ఓ మహిళ ఆ తీగలు తగిలి సజీవ దహనమయ్యారు. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని లింగాపురంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో గ్రామంలో అలజడి సృష్టించింది. లింగాపురానికి చెందిన సయ్యద్‌ ఫాతిమా (55) సోమవారం రాత్రి మనవళ్లను నిద్రపుచ్చి.. ఆ పక్కనే మరో మంచమేసుకుని పడుకున్నారు. వేసవి కావడంతో చుట్టుపక్కల ఇళ్లవారూ ఆరుబయటే నిద్రించారు. వీరికి కాస్త దూరం నుంచి 11 కేవీ విద్యుత్తు లైను వెళ్తోంది. సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆ విద్యుత్తు తీగ తెగి పెద్దగా మంటలు వ్యాపించాయి. ఆరుబయట పడుకున్న వారంతా ఉలిక్కిపడి ఇళ్లల్లోకి పరుగులు తీశారు. ఫాతిమా మనవళ్లను వారి బంధువు ఇంట్లోకి తీసుకెళ్లారు. ఇది తెలియని ఫాతిమా మనవళ్ల కోసం వెతుకుతూ బయటికి వచ్చి మంచంపై ఉన్న బొంతను తీస్తుండగా విద్యుత్తు తీగ తగిలి క్షణాల్లో సజీవ దహనమయ్యారు. ఈ ఇంటి సమీపంలోనే ఉన్న మరో వృద్ధురాలు రామిరెడ్డి నాగేశ్వరమ్మ (60)కు కూడా విద్యుత్తు తీగ తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. ఫాతిమా భర్త రెహమాన్‌ కొన్నేళ్ల కిందట పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతోనే ప్రాణాలు కోల్పోయారు. స్తంభానికి ఉన్న ఇన్సులేటర్‌ పగిలి, కండక్టర్‌ కిందపడిపోవడంతో తీగలు తెగిపడ్డాయని అధికారులంటున్నారు. ఎలాంటి గాలులు లేకపోయినా, తీగలు తెగిపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. యర్రబాలెం ఉపకేంద్రం పరిధిలోని ఒక్క లైన్‌మెనూ లేకపోవడం, లైన్లు అప్పుడప్పుడైనా తనిఖీ చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని