Road Accident: మద్యం తాగి.. రాంగ్‌రూట్‌లో వస్తూ కాలయముడైన లారీ డ్రైవర్‌

మద్యం తాగి లారీ నడుపుతూ.. అదీ రాంగ్‌రూట్‌లో అతివేగంగా వస్తూ.. ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాడు ఓ డ్రైవర్‌. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం

Updated : 13 Jun 2022 07:07 IST

కారును ఢీకొట్టిన లారీ

దంపతులు, కారు డ్రైవర్‌ మృతి

చిన్నకోడూరు, న్యూస్‌టుడే- ఈనాడు, కరీంనగర్‌: మద్యం తాగి లారీ నడుపుతూ.. అదీ రాంగ్‌రూట్‌లో అతివేగంగా వస్తూ.. ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాడు ఓ డ్రైవర్‌. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం శివారు రాజీవ్‌ రహదారిపై ఆదివారం ఉదయం 10.30 సమయంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కరీంనగర్‌ పట్టణానికి చెందిన రిటైర్డ్‌ అధ్యాపకుడు తాండ్ర పాపారావు(62), ఆయన భార్య పద్మ(56) ఓ అద్దె కారులో కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును అదే జిల్లాలోని నాగుల మల్యాలకు చెందిన గొంటి ఆంజనేయులు(48) నడుపుతున్నారు. మల్లారం శివారులోకి రాగానే.. ఎదురుగా రాంగ్‌రూటులో వేగంగా వస్తున్న లారీ ముందు నుంచి కారును ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. లారీ డ్రైవర్‌ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీ సాయంతో బయటకు తీసి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వనపర్తి జిల్లా జూరాలకు చెందిన లారీ డ్రైవర్‌ శ్రీనివాస్‌ తప్పించుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పద్మ సోదరుడు శ్రీనివాస్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌ గొంటి ఆంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

మనవడిని చూడకుండానే..
పాపారావు, పద్మ దంపతుల కుమారుడు ప్రీతమ్‌రావు రెండేళ్ల కిందట అమెరికా వెళ్లి అక్కడే ఉంటున్నారు. ఇటీవల ప్రీతమ్‌రావుకు కొడుకు పుట్టడంతో  మనవడిని చూసేందుకు వారం, పది రోజుల్లో అమెరికా పయనానికి పాపారావు దంపతులు సిద్ధమవుతున్నారు. ఇంతలోనే ఊహించని ప్రమాదంలో ఇద్దరూ కన్నుమూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని