గ్రామీణ బ్యాంకులో భారీ దోపిడీ

గ్యాస్‌ కట్టర్లతో బ్యాంకు లాకర్‌ను ధ్వంసం చేసి రూ.4.46 కోట్ల విలువైన సొమ్ము దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. 44వ జాతీయ రహదారిపై మెండోరా మండలం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ

Updated : 05 Jul 2022 06:28 IST

 నిజామాబాద్‌ జిల్లాలో ఘటన

గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ ధ్వంసం చేసి 8.3 కిలోల బంగారం చోరీ

మొత్తం రూ.4.46 కోట్ల సొత్తు అపహరణ

ఈనాడు, నిజామాబాద్‌, బాల్కొండ, న్యూస్‌టుడే: గ్యాస్‌ కట్టర్లతో బ్యాంకు లాకర్‌ను ధ్వంసం చేసి రూ.4.46 కోట్ల విలువైన సొమ్ము దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. 44వ జాతీయ రహదారిపై మెండోరా మండలం బుస్సాపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాభివృద్ధి కమిటీ భవనంపై అంతస్తులో ఉన్న బ్యాంకు తాళాలు తొలగించి దొంగలు లోనికి ప్రవేశించారు. వెంట తెచ్చుకున్న గ్యాస్‌ సిలిండర్లతో కట్టర్లను వినియోగించి స్ట్రాంగ్‌రూం తాళాలు తొలగించారు. బ్యాంకులో రెండు లాకర్లుండగా తాకట్టు బంగారం ఉంచిన పెద్ద లాకర్‌ను ధ్వంసం చేశారు. ఇందులో రూ.7.30 లక్షల నగదు, 8.3 కిలోల బంగారు ఆభరణాలు, దస్త్రాలు ఉన్నాయి. గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ తలుపును కోసే క్రమంలో నిప్పురవ్వల కారణంగా కొంత నగదు, దస్త్రాలు దగ్ధమయ్యాయి. దుండగులు వెంటతెచ్చిన గ్యాస్‌ సిలెండర్లు అక్కడే వదిలేసి బంగారంతో పరారయ్యారు. దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి వీడియో రికార్డు జరిగే డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. ఎలుగుబంటి రూపంలో ఉండే మాస్కులు ధరించి వచ్చిన దొంగలు బ్యాంకు ఆవరణలో ఓ మాస్క్‌ వదిలి వెళ్లారు. ఖాతాదారుల ఆభరణాల లాకర్‌కు ఏమీ కాకపోవటంతో మరింత భారీ చోరీ తప్పినట్లయింది. 

శనివారం రాత్రే దోపిడీ

దోపిడీ శనివారం అర్ధరాత్రే జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆదివారం ఉదయమే బ్యాంకు కింద ఉండే హోటల్‌కు వచ్చిన కొందరు కాలిపోయిన వాసన గుర్తించినప్పటికీ అటువైపు వెళ్లలేదు. బ్యాంకుకు సెలవు కావడంతో ఉద్యోగులెవరూ రాలేదు. సోమవారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది బ్యాంకులో పరిస్థితిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్‌ టీం వేలిముద్రలు సేకరించింది. జాగిలాలతో తనిఖీలు చేయించారు. అవి సమీపంలో జాతీయ రహదారి వెంట నిర్మల్‌ జిల్లా వైపు వెళ్లాయి. దొంగలు బ్యాంకు భవనానికి ముందు నుంచి కాకుండా వెనకాల ఉన్న పాఠశాల, బీఎస్‌ఎన్‌ఎల్‌ పాత ఎక్స్ఛ్‌ంజ్‌ గోడలు దూకి వచ్చినట్లు తేలింది.  

పనిచేయని స్ట్రాంగ్‌రూం తాళం

బ్యాంకులో స్ట్రాంగ్‌రూమ్‌కు ఉన్న ఆటోమేటిక్‌ తాళం పనిచేయక పోవడంతో ఇళ్లకు వేసే తాళం ఉపయోగించారు. దొంగలు దీన్ని సులువుగా తొలగించి లోనికి ప్రవేశించారు. అక్కడ రాత్రి వేళల్లో ఎవరైనా లాకర్‌ను తాకితే బ్యాంకు మేనేజర్‌, స్థానిక పోలీసుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌ అలారం వెళ్లే ఎలక్ట్రానిక్‌ పరికరం అమర్చారు. దొంగలు దీన్ని ముందే గుర్తించి వైర్లు కట్‌చేసి చిప్‌ తీసుకెళ్లిపోయారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ నాగరాజు విలేకరులకు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని