Prabhas: ప్రభాస్‌ ‘రాజాసాబ్‌’ మరింత ఆలస్యం.. కారణమిదే!

Raja Saab: ప్రభాస్‌, మారుతీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్ర షూటింగ్‌ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్‌ టాక్‌.

Published : 10 May 2024 19:57 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాజాసాబ్’ (Raja Saab). కొన్ని రోజుల కిందట విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. మాస్‌ లుక్‌లో లుంగీ కట్టుకుని నడుచుకుంటూ వస్తున్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోయారు. ఆ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ప్రస్తుతం ప్రభాస్‌కున్న సినిమాల షెడ్యూల్‌ను బట్టి చూస్తే ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలుగులో ఉన్న అగ్ర కథానాయకుల్లో ప్రభాస్‌లా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటుడు మరొకరు లేరు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2898 AD’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. తాజాగా మంచు విష్ణు ‘కన్నప్ప’ సెట్‌లోకి ప్రభాస్‌ అడుగుపెట్టారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఇందులో నందీశ్వరుడి పాత్రలో ఆయన కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలన్నీ ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. దీని తర్వాత ‘సలార్‌2’కు  ఇంకాస్త సమయం పడుతుందని అందరూ అనుకున్నారు. ఈలోగా ‘రాజాసాబ్‌’కు సంబంధించిన షెడ్యూల్‌లో పాల్గొంటారని భావించారు. అయితే, ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌-2’ను వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను లాక్‌ చేసి, స్పెషల్‌ సెట్‌ కూడా వేసేశారు. ఈ నెలలో జరిగే షెడ్యూల్‌లో ప్రభాస్‌ లేని సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. వచ్చే నెల నుంచి ప్రభాస్‌తో పాటు, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇతర కీలక నటుల నేపథ్యంలో సన్నివేశాలను తీయనున్నారని సమాచారం. దీంతో ‘రాజాసాబ్‌’ షూట్‌ ఇంకొంత ఆలస్యం కానుంది.

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో హారర్‌ ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దుతున్నట్లు టాక్‌. ఇప్పటివరకూ ప్రభాస్‌ చేయని సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు, మూవీ విజువల్స్‌పరంగా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయని అంటున్నారు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమారి తదితరులు ప్రభాస్‌తో ఆడి పాడనున్నారు. ‘బాహుబలి’ తర్వాత భారీ బడ్జెట్‌ చిత్రాల్లో కనిపించిన ప్రభాస్‌ పాత్ర ఇందులో రిఫ్రెషింగ్‌ ఉంటుందని, అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని