Suicide: రూ.10 కోట్లకు పైగా అప్పులు? ప్రభుత్వ ఉపాధ్యాయుడి బలవన్మరణం..

భార్యభర్తలిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు.ఇద్దరు పిల్లలు.చీకూ చింతా లేకుండా సాఫీగా సాగిపోవలసిన కుటుంబం...కానీ భర్త ఉరేసుకుని

Updated : 12 Aug 2022 09:19 IST

సూర్యాపేట నేరవిభాగం, మునగాల గ్రామీణం, న్యూస్‌టుడే: భార్యభర్తలిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు.ఇద్దరు పిల్లలు.చీకూ చింతా లేకుండా సాఫీగా సాగిపోవలసిన కుటుంబం...కానీ భర్త ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. శవపరీక్ష అనంతరం ఆయన మృతదేహాన్ని ఊరికి తీసుకొస్తుండగా..అప్పులిచ్చిన వారు వాహనాన్ని అడ్డుకున్నారు. గ్రామ పొలిమేరలో రహదారికి అడ్డంగా కంపచెట్లు చేశారు. పోలీసులు సర్దిచెప్తే తప్ప వారు గ్రామంలోకి అనుమతించలేదు. ఆన్‌లైన్‌ బెట్టింగులకు అలవాటుపడి పెద్దమొత్తంలో అప్పులు చేయడమే ఈ పరిణామాలకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోదేశి నరేంద్రబాబు (55) విషాదగాథ ఇది.  పోలీసుల కథనం ప్రకారం.. చివ్వెంల మండలం గుంజలూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయన  సూర్యాపేటలోని శ్రీశ్రీనగర్‌లో నివాసముంటున్నారు. ఆయన భార్య ధనలక్ష్మి పెన్‌పహాడ్‌ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. అప్పులిచ్చినవారు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ నరేంద్రబాబుపై ఇటీవల ఒత్తిడి తెచ్చారు. గురువారం ఉదయం ఆయన ఫ్యానుకు ఉరేసుకుని కనిపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు.

రూ.10 కోట్లకు పైగా అప్పులు?
నరేంద్రబాబు సుమారు రూ.10 కోట్లకు పైగానే అప్పు చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఈ డబ్బును ఎక్కడ ఖర్చు చేశారన్న విషయం అంతుచిక్కడం లేదు. ఎలాంటి చెడు వ్యసనాలు లేనప్పటికీ ఇంత పెద్దమొత్తం డబ్బును ఏం చేశారన్న అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయి. పోలీసుల దర్యాప్తులోనూ ఈ విషయంపై స్పష్టత రాలేదు. అప్పు తెచ్చిన డబ్బులను ఎక్కడ ఖర్చు చేశారో తమతో చెప్పలేదని  నరేంద్రబాబు భార్య, కుమారుడు సైతం పోలీసుల విచారణలో తెలిపారు. అప్పుగా తెచ్చిన డబ్బును పెద్దమొత్తంలో ఆన్‌లైన్‌లో బెట్టింగులు పెట్టి ఉంటారన్న అనుమానాలను నరేంద్రబాబు స్నేహితులు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని