వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి

ప్రభుత్వ విప్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి....

Updated : 20 Aug 2022 22:37 IST

తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ఘటన
నోరు మెదపని పోలీసులు

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- తాడేపల్లి: ప్రభుత్వ విప్‌, అనంతపురం జిల్లా రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథరెడ్డి (34) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని అవంతి అపార్ట్‌మెంట్‌ 101వ నంబరు ఫ్లాటులో ఈ ఘటన చోటుచేసుకుంది. మంజునాథరెడ్డి అప్పుడప్పుడూ ఈ ఫ్లాటుకు వచ్చి రెండు, మూడు రోజులు ఉండి వెళ్తుంటారు. మూడు రోజుల కిందట ఇక్కడికి వచ్చిన ఆయన శుక్రవారం శవమై కనిపించారు. మంజునాథరెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి మహేశ్వర్‌రెడ్డి వైకాపా నాయకుడు, పీఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ యజమాని. కుమారుడి మృతి వార్త తెలుసుకుని ఆయన హుటాహుటిన విజయవాడకు బయల్దేరారు. మంజునాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని సామాజిక మాధ్యమాల్లో తొలుత విస్తృత ప్రచారం జరిగింది. కానీ ఘటనా స్థలంలో పరిస్థితులు గమనించినా, స్థానికులు చెబుతున్న అంశాలు విన్నా ఇది అనుమానాస్పద మృతిగానే కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు నోరు మెదపకపోవడం, ఫోన్లు చేసినా స్పందించకుండా గోప్యత పాటించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.  మంజునాథరెడ్డి భార్య స్రవంతి వైద్యురాలు.

అన్నీ అనుమానాలే..

మంజునాథరెడ్డి ఎలా చనిపోయారనే వివరాలు అపార్టుమెంటులో వారు చెప్పలేకపోతున్నారు. ‘101 ఫ్లాటు బాధ్యతలు చూసే నరేంద్రరెడ్డి అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో వచ్చి ఫ్లాట్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అంబులెన్సు వచ్చింది’ అని స్థానికులు చెబుతున్నారు. తాను వెళ్లేసరికి ఫ్లాట్‌లోని కిటీకీలన్నీ మూసి ఉన్నాయని, గొళ్లెం పెట్టుకుని మంజునాథరెడ్డి లోపలే ఉన్నారని, తాను కిటికీ ఎక్కి ఆ తలుపు తెరిచి లోపలికి వెళ్లానని నరేంద్రరెడ్డి తమతో చెప్పాడని స్థానికులు అంటున్నారు ‘మంజునాథరెడ్డి పడిపోయాడంటూ నరేంద్ర పిలవడంతో అంబులెన్స్‌లోకి ఎక్కించడానికి మేమంతా అక్కడికి వెళ్లాం. ఆయన మంచం పక్కనే కింద పడుకుని ఉన్నట్లుగా కనిపించారు. ఆయన ఫ్లాట్‌ లోపలే మరణించారా, మధ్యలో చనిపోయారా, ఆసుపత్రికి వెళ్లాక ప్రాణం విడిచారా అన్నది తెలియదు’ అని స్థానికులు వివరించారు. మంజునాథరెడ్డి మృతదేహం ప్రస్తుతం మణిపాల్‌ ఆసుపత్రిలో ఉంది.

బిల్లులు అందక ఒత్తిడి
‘కశ్మీర్‌ తదితర రాష్ట్రాల్లో చేసిన కొన్ని పనులకు సంబంధించి రాంకీ సంస్థ నుంచి మా కంపెనీకి బిల్లులు రావాల్సి ఉంది. మరోవైపు సకాలంలో బ్యాంకు నుంచి ఫైనాన్స్‌ అందలేదు. ఈ నేపథ్యంలో మా అబ్బాయి కొన్ని రోజులుగా ఒత్తిడికి గురవుతున్నారు’ అని మంజునాథరెడ్డి తండ్రి మహేశ్వర్‌రెడ్డి ‘ఈనాడు’కు ఫోన్‌లో వివరించారు. సాయంత్రం సమయంలో చనిపోయినట్లు తమకు ఫోన్‌ వచ్చిందని, వెంటనే విజయవాడకు బయల్దేరామని వివరించారు. ఆయన స్వగ్రామం పప్పిరెడ్డిగారిపల్లెలో విషాదం అలుముకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని