Kejriwal: కేజ్రీవాల్‌ విడుదల.. తిహాడ్‌ జైలు వద్ద ప్రజలకు అభివాదం

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

Updated : 10 May 2024 19:57 IST

దిల్లీ: ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. దిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయిన ఆయనకు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సుప్రీంకోర్టు జూన్‌ 1 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో జైలు అధికారులు ఆయన్ను ఈ సాయంత్రం విడుదల చేశారు. జైలు నుంచి బయటకు కారులో వెళ్తూ ప్రజలకు ఆయన అభివాదం చేశారు. తమ అభిమాన నేత విడుదల సందర్భంగా ఆప్‌ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున జైలు వద్దకు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ వారికి అభివాదం చేస్తూ ప్రసంగించారు. కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు 50 రోజుల తర్వాత విడుదలైన కేజ్రీవాల్‌ తన కాన్వాయ్‌లో ఇంటికి బయల్దేరారు. వాహనంలో ఆయన సతీమణి సునీత, కుమార్తె హర్షిత, ఆప్‌ రాజ్యసభ ఎంపీ సందీప్‌ పాఠక్‌ ఉన్నారు.

కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సుప్రీం

హనుమాన్‌ వల్లే బయటకు వచ్చా!

‘‘హనుమాన్‌ వల్లే బయటకు వచ్చాను. శనివారం ఉదయం 11గంటలకు హనుమాన్‌ ఆలయాన్ని సందర్శిస్తా. మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు జడ్జిలకు కృతజ్ఞతలు. వారి వల్లే ఈరోజు మీ ముందుకొచ్చాను. నన్ను ఆశీర్వదించిన కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞతలు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి. నా శక్తిమేరకు పోరాడతాను.. కానీ, 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలి. శనివారం మధ్యాహ్నం 1గంటకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తాం’’ అని తెలిపారు.  

మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయన మధ్యంతర బెయిల్‌పై శుక్రవారం విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు