ఓ వర్గం వారిని హత్య చేయాలనే..!

ఓ వర్గం ప్రజలను హత్య చేసే లక్ష్యంతోనే పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకలాపాల పేరిట నిజామాబాద్‌లోని కొంతమందికి అబ్దుల్‌ ఖాదర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చాడని ఎన్‌ఐఏ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో

Published : 21 Sep 2022 04:48 IST

 ఆ లక్ష్యంతోనే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చారు..

పీఎఫ్‌ఐ కేసులో నలుగురు నిందితుల రిమాండ్‌ నివేదికలో ఎన్‌ఐఏ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఓ వర్గం ప్రజలను హత్య చేసే లక్ష్యంతోనే పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకలాపాల పేరిట నిజామాబాద్‌లోని కొంతమందికి అబ్దుల్‌ ఖాదర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇచ్చాడని ఎన్‌ఐఏ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్‌ నివేదికలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) పేర్కొంది. మతవిద్వేష ప్రసంగాల వీడియోలను చూపిస్తూ భారత ప్రభుత్వానికి, చట్టానికి వ్యతిరేకంగా సంస్థ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నినట్లు వెల్లడించింది. పీఎఫ్‌ఐ ముసుగులో మతవిద్వేష కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లోని 40 ప్రాంతాల్లో సోదాలు చేసిన ఎన్‌ఐఏ.. నిజామాబాద్‌కు చెందిన సయ్యద్‌ యాహియా సమీర్‌(21), ఆదిలాబాద్‌కు చెందిన ఫెరోజ్‌ఖాన్‌(22), మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటకు చెందిన మహ్మద్‌ ఒస్మాన్‌(34), కరీంనగర్‌కు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌(33)ను సోమవారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నలుగురి రిమాండ్‌ నివేదికలో ఎన్‌ఐఏ పలు కీలక అంశాల్ని ప్రస్తావించింది. విచారణ సందర్భంగా తొలుత తమకేమీ సంబంధం లేదని చెప్పిన నిందితులు.. దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని పేర్కొంది. ఓ వర్గానికి చెందిన ఎంపిక చేసినవారిని చంపేసేందుకు వారి కీలక అవయవాలపై గురిచూసి దాడి చేయడంపై నిందితులు శిక్షణ ఇచ్చారని స్పష్టంచేసింది. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న డిజిటల్‌ ఆధారాల్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో విశ్లేషించాల్సి ఉందని, నిందితుల బ్యాంకు ఖాతాలను సమగ్రంగా పరిశీలించి ఆర్థిక లావాదేవీల గుట్టు తేల్చాల్సి ఉందనీ తెలిపింది. దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉన్నందున నిందితులు జ్యుడీషియల్‌ రిమాండ్‌లోనే ఉండాల్సిన అవసరముందని పేర్కొంది. నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు 30 రోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని