బాలికపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు

అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి కఠిన కారాగారశిక్ష పడింది. కేవలం అయిదున్నర నెలలోనే ఆదిలాబాద్‌ ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు

Updated : 28 Sep 2022 06:14 IST

అయిదున్నర నెలల్లోనే ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు తీర్పు

ఆదిలాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: అభంశుభం తెలియని ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి కఠిన కారాగారశిక్ష పడింది. కేవలం అయిదున్నర నెలలోనే ఆదిలాబాద్‌ ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నేరస్థునికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి డి.మాధవీకృష్ణ మంగళవారం తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు. ఈ వివరాలను ఉట్నూరు ఏఎస్పీ హర్షవర్ధన్‌ శ్రీవాత్సవ్‌, ప్రత్యేక పీపీ ముస్కు రమణారెడ్డితో కలిసి ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి కోర్టు ఆవరణలో వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చి ఉట్నూరులో యాచకులుగా జీవిస్తున్న కుటుంబానికి చెందిన ఆరేళ్ల బాలిక ఈఏడాది ఏప్రిల్‌ 15న భిక్షాటన చేస్తుండగా అదేగ్రామానికి చెందిన షేక్‌ ఖాలీద్‌(45) అయిదు రూపాయలు ఆశ చూపి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. దీంతో బాలిక రోదిస్తూ తల్లికి విషయం చెప్పటంతో ఆమె ఉట్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ భరత్‌ సుమన్‌ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసును ప్రత్యేకంగా తీసుకున్న ఏఎస్పీ హర్షవర్ధన్‌ శ్రీవాత్సవ్‌ దర్యాప్తు పూర్తిచేసి ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో తుది నివేదిక సమర్పించారు. ప్రత్యేక పీపీ ముస్కు రమణారెడ్డి.. 9 మంది సాక్షులను విచారించి నేరాన్ని రుజువు చేశారు. గతంలో సమత అత్యాచారం కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు కేవలం 56 రోజుల్లోనే తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని