దిల్లీలో అరెస్టులు..హైదరాబాద్‌లో ప్రకంపనలు!

దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో మొదలైన అరెస్టులు హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఈ కేసులో నిందితుడిగా ఉండటం.. ఇప్పటికే సీబీఐ ఒకసారి, ఈడీ మూడుసార్లు

Updated : 29 Sep 2022 05:32 IST

మద్యం ముడుపుల వ్యవహారంలో తాజాగా అరెస్టయిన వారితో రామచంద్ర పిళ్లైకి సంబంధాలు

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారంలో మొదలైన అరెస్టులు హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఈ కేసులో నిందితుడిగా ఉండటం.. ఇప్పటికే సీబీఐ ఒకసారి, ఈడీ మూడుసార్లు సోదాలు నిర్వహించడంతో దర్యాప్తు సంస్థల వేడి ఏ క్షణమైనా నగరానికి తాకొచ్చని భావిస్తున్నారు. పైగా ఇప్పుడు దిల్లీలో అరెస్టయిన ఇద్దరు నిందితులకు రామచంద్ర పిళ్లైతో సంబంధం ఉందని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనడం కూడా తదుపరి చర్యలు హైదరాబాద్‌లో ఉండొచ్చనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది.

మద్యం ముడుపుల కేసు దర్యాప్తులో భాగంగా 24 గంటల వ్యవధిలోనే సీబీఐ, ఈడీలు ఇద్దరు నిందితులను అరెస్టు చేశాయి. ‘మచ్‌లౌడర్‌’ సంస్థ సీఈవో, ‘ఆప్‌ కమ్యూనికేషన్స్‌’ ఇన్‌ఛార్జి విజయ్‌నాయర్‌ను మంగళవారం సీబీఐ, ‘ఇండో స్పిరిట్‌’ ఎండీ సమీర్‌ మహేంద్రును బుధవారం ఈడీ అధికారులు దిల్లీలో అరెస్టు చేశారు. విజయ్‌ నాయర్‌ తరఫున మహేంద్రు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల నగదును దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అనుచరుడు అర్జున్‌ పాండేకు అందజేశారన్నది సీబీఐ అభియోగం. ఈ డబ్బులో కొంత రామచంద్ర పిళ్లైదని అనుమానిస్తున్నారు. కేవలం ఈ ముడుపులతో సంబంధం ఉన్న కారణంగానే ఇద్దర్ని అరెస్టు చేయగా.. వీటిని అందజేసిన వారిపై దర్యాప్తు సంస్థలు తదుపరి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దర్యాప్తులో భాగంగా తొలుత రామచంద్ర పిళ్లై ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ, ఈడీ తర్వాత క్రమంగా ఆయనతో కలిసి వ్యాపారం చేస్తున్న వారి వివరాలు సేకరించి అక్కడా సోదాలు జరిపాయి. దాంతోపాటు పదుల సంఖ్యలో వ్యాపార సంస్థల వివరాలను రెండు దర్యాప్తు సంస్థలు సేకరించాయి. వాటిలో జరిగిన లావాదేవీలు, వాస్తవంగా వాటి ఆదాయ వనరుల వంటివాటన్నింటినీ జల్లెడ పడుతున్నాయి. వాస్తవానికి ఈ సంస్థలు వ్యాపారం ద్వారా ఆదాయం ఆర్జించకపోయినా నల్లదనాన్ని వీటిలోకి మళ్లించి దాన్నే లాభంగా చూపించారని, తద్వారా అనధికారిక డబ్బును చట్టబద్ధం చేసుకున్నారని భావిస్తున్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో వెలుగు చూసింది కూడా ఈ డబ్బే అనేది దర్యాప్తు సంస్థల అనుమానం. దాన్ని నిర్ధారించేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారు. డబ్బు అందజేసిన వారిని అరెస్టు చేశారు. దాంతో తదుపరి చర్యలు ఈ డబ్బు సమకూర్చిన వారిపైనే ఉంటాయని భావిస్తున్నారు.

మద్యం వ్యాపారి సమీర్‌ను అరెస్టు చేసిన ఈడీ

దిల్లీ: మనీ లాండరింగ్‌, దిల్లీ ఎక్సైజ్‌ విధానం అవకతవకల్లో గల సంబంధంపై మద్యం వ్యాపారి సమీర్‌ మహేంద్రును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బుధవారం అరెస్టు చేసింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఈడీ తన కార్యాలయంలో మంగళవారం రాత్రి పొద్దుపోయేదాక విచారించింది. ఆయన్ను ఇంకా విచారించేందుకు రిమాండ్‌ కోసం స్థానిక కోర్టుకు తరలిస్తారని భావిస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ.. మహేంద్రును ఇంతకు ముందే ప్రశ్నించింది. మద్యం పంపిణీ సంస్థ ఇండో స్పిరిట్‌కు మహేంద్రు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 

బంధుమిత్రుల పేర్లతో..

మద్యం ముడుపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన సంస్థలన్నీ కొందరు ప్రముఖుల కుటుంబసభ్యులు, బంధుమిత్రుల పేర్లతో ఉన్నాయని దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు సమాచారం. దాంతో మద్యం ముడుపులతో ప్రత్యక్షంగా సంబంధం ఉందని భావిస్తున్న సంస్థల్లో అధికారికంగా ఉన్న భాగస్వాములపై త్వరలోనే చర్యలు ఉండవచ్చని.. వారికి నోటీసులు ఇచ్చి దిల్లీ పిలిపించవచ్చని తెలుస్తోంది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts