ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ పరిచయం

ఓ వివాహిత అనుమానాస్పదంగా బలవన్మరణానికి పాల్పడిన ఘటన నంద్యాల జిల్లా దొర్నిపాడులో చోటుచేసుకుంది.  

Updated : 05 Nov 2022 05:19 IST

వివాహిత బలవన్మరణం

ఆళ్లగడ్డ, దొర్నిపాడు, న్యూస్‌టుడే: ఓ వివాహిత అనుమానాస్పదంగా బలవన్మరణానికి పాల్పడిన ఘటన నంద్యాల జిల్లా దొర్నిపాడులో చోటుచేసుకుంది.  బాపట్ల జిల్లా నర్సయ్యపాలెం గ్రామానికి చెందిన భూషణానికి 52 ఏళ్లు, అతడికి 20 ఏళ్ల కుమారుడు, 18 ఏళ్ల కుమార్తె ఉండగా, భార్యను వదిలేశాడు. అలాగే దొర్నిపాడుకు చెందిన హసీనా(25)కు ఇద్దరు పిల్లలున్నారు. భర్త మద్యానికి బానిస కావడంతో అతనికి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భూషణం, హసీనాలకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. రెండేళ్లుగా ఫోన్లో మాట్లాడుకోవడంతోపాటు సందేశాలు పంపించుకుంటున్నారు. ఇటీవల భూషణం.. హసీనాను తన వద్దకు వచ్చేయాలని పిలవడంతో ఈ నెల 1న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఏడేళ్ల కుమారుడితో కలిసి వెళ్లిపోయింది. ఈ ఘటనపై హసీనా తండ్రి దూదేకుల బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించి బాపట్లలోని నర్సయ్య పాలెంలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని దొర్నిపాడుకు తీసుకువచ్చారు. ఎస్సై తిరుపాలు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 3వ తేదీ రాత్రి హసీనాను తండ్రికి అప్పగించి ఇంటికి పంపించారు. భూషణాన్ని సైతం పోలీసులు వదిలేయడంతో అతడు తిరిగి బాపట్లకు వెళ్లిపోయాడు. శుక్రవారం తహసీల్దార్‌ సమక్షంలో హసీనాను బైండోవర్‌ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఆమె ఉదయం 6 గంటల సమయంలో తన మేనమామ ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. ఇద్దరూ వివాహితులై పిల్లలుండి ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడటం, అది కాస్తా ఒక ప్రాణం తీసుకోవడానికి కారణం కావడం బాధాకరమని స్థానికులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని