pakistan: భారత్‌ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత

పాకిస్థాన్‌లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్‌ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు.

Updated : 30 Apr 2024 13:16 IST

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్‌ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. పరోక్షంగా న్యూదిల్లీ గురించి ఆయన ప్రస్తావిస్తూ‘‘పొరుగు దేశంతో మనల్ని పోల్చుకోండి. రెండూ ఒకే రోజు స్వాతంత్ర్యం పొందాయి. కానీ, నేడు వారు సూపర్ పవర్ కావాలని కలలు కంటున్నారు. మనమేమో దివాలా తీయకుండా ఉంటే చాలని ప్రయత్నిస్తున్నాము’’అని పాక్‌ ఆర్థిక పరిస్థితిపై వ్యాఖ్యానించారు. తమ దేశం దివాలా తీయకుండా ఉండేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐ.ఎం.ఎఫ్‌)ని వేడుకుంటోందన్నారు.

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ సైతం గతంలో ఇదే విధంగా భారత్‌ అభివృద్ధిని కొనియాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ వైపు వారు చంద్రయాన్‌లు, జీ20 సమావేశాలు జరుపుతుంటే..పాక్‌ మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటోంది. భారత్‌ వలే అభివృద్ధిని పాక్ ఎందుకు సాధించలేకపోయింది. దీనికి బాధ్యులు ఎవరు?’’అని అప్పట్లో ఆయన ప్రశ్నించారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్‌కు మరో 1.1 బిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఎగ్జిక్యూటివ్ బోర్డు మంగళవారం ఆమోదముద్ర వేసింది. 3 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై పాకిస్థాన్‌, ఐఎంఎఫ్‌ మధ్య జరిగిన ఒప్పందం ఈ నెలతో ముగియనుంది. ఈ క్రమంలోనే చివరి విడతగా రుణాన్ని మంజూరుచేసేందుకు అంగీకారం లభించింది. కాగా.. ఒప్పందంలో భాగంగా ఇప్పటికే పాక్‌ రెండు విడతల్లో 1.9 బిలియన్‌ డాలర్లను అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని