Amit Shah: అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పీఏ అరెస్టు

Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా నకిలీ వీడియోల కేసులో కాంగ్రెస్‌ నేత పీఏ, ఆమ్‌ఆద్మీ పార్టీ నేతను పోలీసులు అరెస్టు చేశారు.

Published : 30 Apr 2024 17:22 IST

అహ్మదాబాద్‌: రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చెబుతున్నట్లుగా నకిలీ వీడియోలు (Fake Video) సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దీనిపై గుజరాత్‌ (Gujarat) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలోనే అమిత్‌ షా నకిలీ వీడియోను షేర్‌ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్‌ నేత అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగం.. బనస్కంతాకు చెందిన సతీశ్‌ వన్సోలా, దాహోద్‌ జిల్లాకు చెందిన రాకేశ్‌ బరియాను మంగళవారం అరెస్టు చేసింది. వీరిలో సతీశ్‌.. గత ఆరేళ్లుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇక, రాకేశ్‌ గత నాలుగేళ్లుగా ఆమ్‌ఆద్మీ పార్టీ దాహోద్‌ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.

‘అసహనంతోనే ఫేక్‌ వీడియోలు’ : కాంగ్రెస్‌పై మండిపడ్డ అమిత్‌ షా

‘‘ఈ ఎడిటెడ్‌ వీడియో వీరిద్దరికీ వాట్సప్‌లో వచ్చింది. దాన్ని వారు ఉద్దేశపూర్వకంగానే ఫేస్‌బుక్‌ పేజీల్లో షేర్‌ చేశారు. ఈ వీడియోను ఎవరు ఎడిట్‌ చేశారన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నాం. త్వరలోనే అతడిని పట్టుకుంటాం’ అని సైబర్‌ సెల్‌ డిప్యూటీ కమిషనర్‌ వెల్లడించారు. కాగా.. ఈ అరెస్టుపై ఎమ్మెల్యే మేవానీ స్పందించారు. ‘‘భాజపా ఐటీ విభాగం చాలాకాలంగా నకిలీ వీడియోలను వ్యాప్తి చేస్తోంది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సామాన్యులను అరెస్టు చేస్తున్నారు. సతీశ్ పొరబాటుగానే ఆ వీడియోను షేర్‌ చేశాడు’’ అని తెలిపారు. 

అమిత్‌ షా ఈనెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ‘‘భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీన్ని వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్‌ చేసిన నకిలీ వీడియోను కొంతమంది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. దీంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేయగా.. దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. పలు రాష్ట్రాల్లోనూ దీనిపై కేసులు నమోదయ్యాయి. ఈమేరకు పలువురు కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు అందాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని