కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!

కరోనా వైరస్‌ (సార్స్‌కోవ్‌-2) జన్యు సీక్వెన్స్‌ను తొలిసారి ప్రచురించిన వైరాలజిస్ట్‌కు చైనా అధికారుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.

Published : 30 Apr 2024 14:40 IST

షాంఘై: చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా (Coronavirus) వైరస్‌ సీక్వెన్స్‌ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నాడు. కొంతకాలంగా ఆ దేశాధికారుల నుంచి వేధింపులను ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఆయన పనిచేస్తున్న ల్యాబ్‌ నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో చేసేది లేక అదే ల్యాబ్‌ ఎదుట ఆయన నిరసనకు దిగాడు.

తనతోపాటు తన బృందాన్ని కూడా ప్రయోగశాల నుంచి బయటకు వెళ్లాలని అధికారులు ఆదేశించారని పేర్కొంటూ వైరాలజిస్టు జాంగ్‌ యోంగ్‌జెన్‌ ఓ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. వర్షం కురుస్తున్నప్పటికీ ఆదివారం నుంచి ల్యాబ్‌ వెలుపలే కూర్చొని నిరసన చేపట్టినట్లు అందులో పేర్కొన్నాడు. అనంతరం ఆ పోస్టును ఆయన తొలగించినప్పటికీ.. కార్యాలయం బయటే ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలిసింది. దీనిపై స్పందించాలని మీడియా కోరగా.. మాట్లాడేందుకు అనువైన పరిస్థితులు లేవని బదులిచ్చాడు.

కొవిడ్‌ మూలాలపై శోధన.. మూసుకుపోతున్న దారులు!

జనవరి 2020లో కొవిడ్‌-19 (Covid 19) కారణమైన వైరస్‌ సీక్వెన్స్‌ను ప్రచురించిన మొదటి చైనా శాస్త్రవేత్తగా జాంగ్‌ నిలిచారు. నాటి నుంచి ఆయనపై వేధింపులు మొదలైనట్లు సమాచారం. డిమోషన్లతోపాటు పలు కార్యక్రమాల్లో బహిష్కరణలు వంటివి ఎదుర్కొంటున్న క్రమంలోనే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌పై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తల మీద ఒత్తిడి పెంచడంతోపాటు వారిని నియంత్రించేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి సంబంధించి చర్యలను పరిశీలించే వారిని కూడా చాలా కాలంగా బీజింగ్‌లోని జిన్‌పింగ్‌ సర్కారు ఇబ్బందులు పెడుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని