Gold: ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!

Gold: మార్చిలో బంగారం ధరలు గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ జనవరి-మార్చి త్రైమాసికంలో గిరాకీ ఎనిమిది శాతం పుంజుకుంది.

Published : 30 Apr 2024 15:12 IST

దిల్లీ: బంగారం ధరలు పెరిగినా.. కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా పసిడి గిరాకీ వార్షిక ప్రాతిపదికన 8 శాతం పెరిగి 136.6 టన్నులకు చేరింది. బలమైన ఆర్థిక పరిస్థితులే అందుకు కారణమని ప్రపంచ స్వర్ణ మండలి (WGC) పేర్కొంది. ఆర్‌బీఐ పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం కూడా డిమాండ్‌ పుంజుకోవడానికి దోహదం చేసింది.

జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారం (Gold) డిమాండ్ విలువ పరంగా క్రితం ఏడాదితో పోలిస్తే 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది. మొత్తం పసిడి గిరాకీలో ఆభరణాల వాటా 95.5 టన్నులు. ఇది వార్షిక ప్రాతిపదికన నాలుగు శాతం పెరిగింది. పెట్టుబడుల కోసం కొనుగోలు చేసే బంగారం (కడ్డీలు, నాణేలు.. ఇతరత్రా) 19 శాతం పుంజుకొని 41.1 టన్నులకు చేరింది. భారత్‌లో కొనసాగుతున్న బలమైన స్థూల ఆర్థిక వాతావరణమే బంగారు ఆభరణాల గిరాకీకి దోహదం చేసిందని డబ్ల్యూజీసీ ఇండియా సీఈఓ సచిన్‌ జైన్ తెలిపారు. మార్చిలో ధరలు ఒక్కసారిగా పెరగటంతో చివర్లో విక్రయాలు నెమ్మదించాయని వెల్లడించారు.

ఈ ఏడాది మొత్తం బంగారం (Gold) గిరాకీ 700-800 టన్నులకు చేరొచ్చని జైన్‌ అంచనా వేశారు. 2023లో ఇది 747.5 టన్నులుగా ఉన్న విషయం తెలిసిందే. సాధారణంగా పసిడి ధరలు తగ్గినప్పుడు భారత్, చైనా వంటి మార్కెట్లలో కొనుగోళ్లు పుంజుకుంటాయని చెప్పారు. పాశ్చాత్య మార్కెట్లో మాత్రం ధరలు పెరిగినప్పుడు డిమాండ్‌ ఎగబాకుతుందని గుర్తుచేశారు. కానీ, ఈసారి ధోరణి అందుకు భిన్నంగా కనిపించిందని చెప్పారు. ఆభరణాలతో పాటు బంగారం బిస్కెట్లు, నాణేలు, ఈటీఎఫ్‌లకూ గిరాకీ పెరిగిందని తెలిపారు.

ఆర్‌బీఐ బంగారం కొనుగోళ్లను పెంచడం కూడా డిమాండ్ పుంజుకోవడానికి దోహదం చేసిన మరో కారణమని జైన్‌ వెల్లడించారు. 2023 మొత్తంలో 16 టన్నులు కొనుగోలు చేసిన కేంద్ర బ్యాంకు.. ఈసారి ఒక్క మార్చి త్రైమాసికంలోనే 19 టన్నులు కొన్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ దీన్ని కొనసాగిస్తామని ఆర్‌బీఐ సంకేతాలిచ్చినట్లు పేర్కొన్నారు.

విలువపరంగా చూస్తే ఆభరణాల వాటా 15 శాతం పెరిగి రూ.52,750 కోట్లకు చేరింది. పెట్టుబడుల వాటా 32 శాతం పెరిగి రూ.22,720 కోట్లకు ఎగబాకింది. మొత్తంగా కొనుగోళ్ల విలువ మార్చి త్రైమాసికంలో 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది. మరోవైపు భారత్‌లో బంగారం (Gold) పునర్వినియోగం పది శాతం పెరిగి 38.3 టన్నులకు చేరింది.

మొత్తం 2024 తొలి మూడు నెలల వ్యవధిలో బంగారం దిగుమతులు 25 శాతం పెరిగి 179.4 టన్నులకు చేరాయి. ఈ త్రైమాసికంలో 10 గ్రాముల సగటు ధర రూ.55,247.20గా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని