వైకాపా నాయకుల వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం

తమకు అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు ఇంటి పట్టా ఇవ్వలేదని ప్రశ్నించిన ఓ మహిళను అధికార పార్టీ నాయకులు వేధింపులకు గురిచేశారు.

Published : 26 Nov 2022 06:06 IST

నందికొట్కూరు, న్యూస్‌టుడే: తమకు అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు ఇంటి పట్టా ఇవ్వలేదని ప్రశ్నించిన ఓ మహిళను అధికార పార్టీ నాయకులు వేధింపులకు గురిచేశారు. దీంతో బాధితురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోటలో శుక్రవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆమె కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... గ్రామంలో గత బుధవారం శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. స్థానిక మహిళ మంగమ్మ అక్కడికి వెళ్లి తమకు అన్ని అర్హతలున్నా పట్టా ఎందుకు ఇవ్వలేదని సిద్ధార్థరెడ్డిని ప్రశ్నించారు. అక్కడే ఉన్న వైకాపా నాయకుడు రమేష్‌నాయుడు ఆమెను అడ్డుకున్నారు. మరో నాయకుడు రామ్‌ప్రసాద్‌ ఆమెపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు, వైకాపా నాయకులు తనపై రోజూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మంగమ్మ వాపోయారు. వారి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై ముచ్చుమర్రి ఎస్సై నాగార్జునను వివరణ కోరగా.. మంగమ్మపై ఫిర్యాదు అందడంతో విచారించేందుకు పిలిచామని, ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని