Hyderabad: నగ్నంగా మార్చి..నరకం!

రౌడీయిజంతో దందాలకు పాల్పడుతున్న ముఠాలోని యువకుడు మరొకరితో జతకట్టడంతో ముఠా నాయకుడు కోపంతో రగిలిపోయాడు.

Updated : 08 Dec 2022 06:51 IST

తరుముతూ ఒకరి తర్వాత ఒకరుగా బెల్టుతో దాడి
ముఠా నుంచి బయటకు వచ్చాడనే కోపంతో ఆటవికం
యువకుడి కిడ్నాప్‌ కేసులో ఐదుగురిపై కేసు నమోదు

రాజేంద్రనగర్‌, లంగర్‌హౌస్‌, న్యూస్‌టుడే: రౌడీయిజంతో దందాలకు పాల్పడుతున్న ముఠాలోని యువకుడు మరొకరితో జతకట్టడంతో ముఠా నాయకుడు కోపంతో రగిలిపోయాడు. అనుచరులతో కలిసి ఆ యువకుడిని నిర్బంధించి..నగ్నంగా మార్చి ఆరు గంటలపాటు నరకం చూపాడు. హైదరాబాద్‌ నగర శివారు కిస్మత్‌పేట్‌లో మంగళవారం జరిగిన ఈ దారుణం బుధవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..బండ్లగూడ జాగీర్‌ సన్‌సిటీ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌(18) వృత్తిరీత్యా కారు డ్రైవర్‌. రౌడీషీటర్‌ ఇర్ఫాన్‌ ముఠాతో కలిసి తిరిగేవాడు. కొంతకాలంగా మరో ముఠాతో కలిసి తిరుగుతున్న అతను.. మంగళవారం మధ్యాహ్నం కారు సర్వీసింగ్‌ కోసం లంగర్‌హౌస్‌ వచ్చాడు. అతనిపై కోపంతో ఉన్న ఇర్ఫాన్‌ తన అనుచరులు ముదాసిర్‌, జహీద్‌, ఫవాజ్‌, షహేన్‌షాతో కలిసి అక్కడికి వచ్చాడు. మహ్మద్‌ ఇర్ఫాన్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిస్మత్‌పూర్‌లోని పాత భవనంలో బంధించారు. అప్పటికే అక్కడకు చేరిన మరో 10 మందితో కలసి బాధితుడిని నగ్నంగా మార్చారు. భవనం ఆవరణలో పరుగులు పెట్టిస్తూ ఒకరి తరువాత ఒకరు బెల్టుతో కొట్టారు.  సాయంత్ర ఏడు గంటలవరకూ దాడిని కొనసాగించిన ముఠా సభ్యులు ఆ దృశ్యాలను వీడియో తీశారు. ఆ వీడియోలకు హిందీ సినిమా పాటను జతచేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. బుధవారం వీడియోలు వైరల్‌ కావడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో లంగర్‌హౌజ్‌, రాజేంద్రనగర్‌ పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. దాడితో ప్రమేయం ఉన్న మరో 10 మంది వివరాలు సేకరిస్తున్నారు. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్‌పై సైబరాబాద్‌ పరిధిలో రౌడీషీట్‌, పలు పోలీస్‌స్టేషన్లలో క్రిమినల్‌ కేసులున్నట్టు గుర్తించారు. బాధితుడు ప్రస్తుతం తీవ్రగాయాలతో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని