Road Accident: మైనర్‌ దుందుడుకు వేగం.. నాలుగు ప్రాణాలు బలి

పదహారేళ్ల కుర్రాడి సరదా నాలుగు నిండుప్రాణాల్ని బలి తీసుకుంది. మిత్రులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా రోడ్డుపైకి వాహనాన్ని తెచ్చిన ఫలితంగా ఒక బాలిక, ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు.

Updated : 31 Jan 2022 04:42 IST

100 కి.మీ. వేగంతో కార్మికులపైకి దూసుకెళ్లిన కారు
వాహనాన్ని నడిపింది పదహారేళ్ల బాలుడు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: పదహారేళ్ల కుర్రాడి సరదా నాలుగు నిండుప్రాణాల్ని బలి తీసుకుంది. మిత్రులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా రోడ్డుపైకి వాహనాన్ని తెచ్చిన ఫలితంగా ఒక బాలిక, ముగ్గురు మహిళలు మృత్యువాత పడ్డారు. ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో కరీంనగర్‌ కమాన్‌ సమీపంలో అతివేగంగా ప్రయాణిస్తూ కారు రోడ్డుపక్కన కొలిమి పని చేసుకుంటున్న మహిళలపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం    జరిగింది.  ఆ సమయంలో కారు వంద కి.మీ. వేగంతో ఉంది. ఈ వాహనంపై (టీఎస్‌ 02 ఈవై 2121) గతంలో కూడా అతివేగంగా వెళ్లిన కారణంగా తొమ్మిది చలాన్లుండటం గమనార్హం. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న ఏడుగురిని కారు ఢీకొంటూ విద్యుత్తు స్తంభానికి తగిలి ఆగిపోయింది. సంఘటనా స్థలిలో కారుకు, విద్యుత్తు స్తంభానికి మధ్యన ఇరుక్కుని పవార్‌ పరియాగ్‌ అలియాస్‌ స్వప్న(32) అనే మహిళ మృతిచెందగా ఆసుపత్రిలో చికిత్స అందించే లోపలే పవార్‌ లలిత(27), పవార్‌ సునీత(30), సోలారి జ్యోతి(14) చనిపోయారు. పవార్‌ అనూష, సోలారి రాణి, ఆరేళ్ల సోలారి అవంతికలు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా దగ్గరి బంధువులే. కొలిమిలో పారలు, గడ్డపారలు, కొడవళ్లకు పదును పెడుతూ జీవనం సాగించేవాళ్లు. ఆదివారం కావడంతో మాంసాన్ని కొనుగోలు చేసిన వారిలో కొందరు వీరి వద్దకు మేక తల, కాళ్లను తీసుకొచ్చి కొలిమిలో కాల్పించుకొని ఎంతోకొంత ఇస్తుంటారు. ఇలా ఉపాధి కోసం తెల్లవారుజామునే వచ్చిన వారి బతుకులు చితికిపోయాయి.

బాలుడి తండ్రితో పాటు ముగ్గురు మైనర్ల అరెస్ట్‌

ఈ ప్రమాద సమయంలో కారు నడుపుతున్న బాలుడి(16)తో పాటు అతని స్నేహితులు 17 ఏళ్ల వయసున్న ఇద్దరిని కరీంనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరితో పాటు ఈ ప్రమాదానికి కారణమయ్యేలా నిర్లక్ష్యంగా కుమారునికి కారు ఇచ్చిన తండ్రిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు కరీంనగర్‌ సీపీ సత్యనారాయణ తెలిపారు. స్థానికంగా వాటర్‌ప్లాంట్‌ నిర్వహించే అతడు వాహనాన్ని తానే నడిపానని ఒకసారి.. డ్రైవర్‌ తీసుకెళ్లి ఉంటాడని మరోసారి చెప్పి నమ్మించడానికి ప్రయత్నించాడని సీపీ వెల్లడించారు. పలు కోణాల్లో విచారించగా చివరకు తన కొడుకే వాహనాన్ని తీసుకెళ్లాడని తెలిపినట్లు వివరించారు. కారు నడిపిన బాలుడు స్థానిక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుండగా.. వెంట ఉన్న ఇద్దరు బాలురు పదోతరగతి చదువుతున్నట్లు తెలిసింది. మరోవ్యక్తి వేరే పాఠశాలలో పదో తరగతి అభ్యసిస్తున్నట్లు సమాచారం. వీరంతా స్నేహితులు కావడంతో తరచూ కారు తీసుకువెళ్లి నగరంలో షికారు చేసినట్లు తెలిసింది. ఉదయం వేళ పొగమంచు సమయంలో వేగంగా కారు నడపడంతో ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. బ్రేక్‌ బదులు యాక్సిలేటర్‌ను బలంగా తొక్కి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో వీరు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీస్తున్నారనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.


మృతుల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని

మృతుల్లో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సోలారి జ్యోతి ఉంది. ప్రమాదంలో చనిపోయిన అక్కాచెల్లెళ్లు(వరుసకు) సునీత, పరియాగ్‌లకు ఈ బాలిక కోడలు. సునీత భర్త సురేశ్‌ కూడా కొలిమి వృత్తిలోనే కొనసాగుతున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒకబాబున్నాడు. పరియాగ్‌ మృతదేహం వద్ద భర్త రమేశ్‌ భోరున విలపించారు. వీరికి సంతానం లేరు. మరో మృతురాలు లలితకు భర్త రాజు ఉన్నారు. పిల్లలు లేరు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రి ఎదుట రహదారిపై కుటుంబ సభ్యులు, అఖిల పక్షం నాయకులు ఆందోళన చేపట్టారు.


మరో ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

మల్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల- కరీంనగర్‌ ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం సమీపంలో ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బత్తిని సంజీవ్‌(26), కాలికంటి మధు అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై మల్యాల నుంచి జగిత్యాల వైపు వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గోపాల్‌ సత్నవి(21), ఒడిశాకు చెందిన సదాకర్‌ సాహూ(28), ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మల్యాలకు చెందిన సంజీవ్‌(26) అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో యువకుడు మధు పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురు వలస కార్మికులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులైన వీరు ఇటీవలే ఇక్కడికి వచ్చారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని