Shraddha Murder: ‘అఫ్తాబ్ నన్ను నరికి చంపుతాడు’.. 2020లోనే శ్రద్ధా ఫిర్యాదు

శ్రద్ధా, అఫ్తాబ్‌ సహజీవనం చేస్తోన్న సమయంలో రెండేళ్ల క్రితం వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అఫ్తాబ్‌ ఆమె మీద చేయిచేసుకున్నాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. 

Updated : 23 Nov 2022 17:18 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితుడు ఆమెను ముక్కలుగా కోసి, దిల్లీలోని అటవీ ప్రాంతంలో విసిరినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తనకు ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని ఆమె ముందుగానే భయపడినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మహారాష్ట్రలోని వసాయ్‌లో ఆమె చేసిన ఫిర్యాదు బట్టి ఈ విషయం వెల్లడవుతోంది. దిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..

శ్రద్ధా, అఫ్తాబ్‌ సహజీవనం చేస్తోన్న సమయంలో రెండేళ్ల క్రితం వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అఫ్తాబ్‌ ఆమె మీద చేయిచేసుకున్నాడు. ఊపిరాడకుండా చేసి, చంపాలని చూశాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ‘నన్ను చంపి, ముక్కలు చేసి, విసిరేస్తానని బెదిరించాడు. నన్ను కొట్టి ఆరునెలలు అయింది. కానీ చంపేస్తానని బెదిరించడంతో ఫిర్యాదు చేసే ధైర్యం చేయలేకపోయాను’ అని దానిలో ఆమె పేర్కొంది. ఇదివరకు ఆమె మొహంపై గాయాలతో ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అదే ఏడాది తన స్నేహితుడికి ఆమె దానిని షేర్ చేసింది. తీవ్ర వెన్ను గాయాలు కావడంతో అప్పుడు ఆమె ఆసుపత్రిలో కూడా చేరిందని ఆ స్నేహితుడు వెల్లడించాడు. అయితే ఈ రెండు ఘటనలు ఒకటేనా లేదా తెలియాల్సి ఉంది.

ఆ ఫిర్యాదులో ఆమె అఫ్తాబ్‌ కుటుంబం గురించి ప్రస్తావించింది. ‘ఈ ప్రవర్తన గురించి అతడి తల్లిదండ్రులకు తెలుసు. వారికి మేం కలిసి ఉంటున్నామని కూడా తెలుసు. వారు అప్పుడప్పుడు మా దగ్గరకు వచ్చేవారు. మా పెళ్లికి వారి ఆశీస్సులు కూడా ఉన్నాయి’ అని చెప్పిన ఆమె.. అతడితో కలిసి ఉండటానికి ఇష్టం లేదని ఫిర్యాదులో పేర్కొంది. అయినప్పటికీ.. శ్రద్ధా అతడితోనే ఎందుకు కలిసుందనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో మహారాష్ట్రలో ఆమె ఇచ్చిన ఫిర్యాదు గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు