TS News: పాము కాటుకు పసిబిడ్డ మృతి!

పొట్టకూటి కోసం కూలీనాలీ చేసుకునే దంపతులు వారు. మూడు నెలల క్రితం పాప పుట్టడంతో తమ ఇంట లక్ష్మిదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఇటీవల శిశువుకు ఊపిరి తిత్తుల్లో సమస్య రావడంతో తల్లడిల్లిపోయారు.

Updated : 08 Nov 2021 07:50 IST

మృతి చెందిన పాప,  కాటు వేసిన పాము

మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: పొట్టకూటి కోసం కూలీనాలీ చేసుకునే దంపతులు వారు. మూడు నెలల క్రితం పాప పుట్టడంతో తమ ఇంట లక్ష్మిదేవి పుట్టిందని సంబరపడ్డారు. ఇటీవల శిశువుకు ఊపిరి తిత్తుల్లో సమస్య రావడంతో తల్లడిల్లిపోయారు. ఆసుపత్రుల వెంట తిరిగి వైద్యానికి రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. ఆరోగ్యం కుదుటపడుతుందని సంతోషిస్తున్న తరుణంలో పసిపాప పాలిట పాము మృత్యువైంది. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్‌ పురపాలిక పరిధిలోని శనిగపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.

ఏర్పుల క్రాంతి-మమత దంపతులకు మూడు నెలల క్రితం పాప జన్మించింది. అనారోగ్యానికి గురికావడంతో వారం క్రితం ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి శనివారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే పాపను పడుకోబెట్టే మంచంపై బొంతలో పాము చేరింది. ఇది గమనించని తల్లిదండ్రులు పాపను పడుకోబెట్టి నిద్రకు ఉపక్రమించారు. కొద్దిసేపటి తరువాత పాప ఏడుస్తుండటంతో తండ్రి లేచి చూడగా ఆమె చేతులు వంకర పోతుండడంతో ఆందోళనతో వెంటనే  ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆటోలో నుంచి క్రాంతి పాపను తీసుకుంటున్న క్రమంలో ఆ బొంతలో నుంచి పాము అతడి కాలుపై పడి కాటేసింది. ఆయనను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆయనకు చికిత్స అందించారు. పరీక్షించిన ప్రైవేటు వైద్యులు పాప అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. క్రాంతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్‌కుమార్‌ తెలిపారు. ‘‘పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ పాప మరణానికి కారణం నిర్దిష్టంగా తెలియదు’ అని వైద్య వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని