
Suicide: కొలువు రాలేదని మనస్తాపం.. యువకుడి ఆత్మహత్య
నరేష్
చందంపేట, న్యూస్‌టుడే: ప్రభుత్వ కొలువు రాలేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా చందంపేట మండల పరిధిలో శనివారం జరిగింది. స్థానికులు, బాధిత బంధువుల కథనం ప్రకారం.. గువ్వలగుట్ట గ్రామానికి చెందిన సపావట్ బూర, కమ్మ దంపతులకు ఆరుగురు కుమారులు. ఇందులో నాలుగో సంతానం నరేష్(30).. చదువుపై ఆసక్తి ఉందని, సర్కారు ఉద్యోగం సాధిస్తానని స్పష్టంగా చెప్పడంతో కుటుంబ సభ్యులు అతన్ని చదివిస్తూ వచ్చారు. అనారోగ్యం కారణంగా అయిదేళ్ల క్రితం తండ్రి చనిపోయిన నాటికి పీజీ పూర్తిచేసిన నరేష్.. నాటి నుంచి పోటీపరీక్షలు రాసేందుకు హైదరాబాద్‌లోనే ఉంటూ శిక్షణ తీసుకుంటున్నాడు. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు నరేష్ ఇద్దరి తమ్ముళ్లకు వివాహాలు జరిపించారు. ఇటీవల దీపావళికి ఇంటికి రాగా.. కొలువు కోసం ఎన్నాళ్లు ఎదురుచూస్తావు, నీకంటే చిన్నోళ్లకు పెళ్లిళ్లయ్యాయని మిత్రులు, కుటుంబ సభ్యులు మందలించడంతో నరేష్ మనస్తాపానికి గురయ్యాడు. శనివారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతిచెందాడు. పక్కనే ‘‘అమ్మా నన్ను క్షమించు. మళ్లీ జన్మంటూ ఉంటే నీ కొడుకుగానే పుట్టాలి. నాకు బతకాలని లేదు. నా చావుకు ఎవరూ కారణం కాదు. నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను నాన్న దగ్గరికి వెళ్లిపోతున్నాను’’ అంటూ ఆయన రాసిన లేఖ లభ్యమైంది. ఘటనపై శనివారం సాయంత్రం వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై సందీప్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.