Teenage Suicide: మూడేళ్లలో 24వేల మంది ఆత్మహత్య!

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండు జీవితాలని తిరిగిరాని లోకానికి తీసుకెళుతున్నాయి. దేశంలో మూడేళ్ల వ్యవధిలోనే 24వేల మంది టీనేజర్లు (14-18ఏళ్ల వయసు) ఆత్మహత్యకు పాల్పడినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

Published : 02 Aug 2021 01:19 IST

పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో NCRB వెల్లడి

దిల్లీ: క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నిండు జీవితాలని తిరిగిరాని లోకానికి తీసుకెళుతున్నాయి. దేశంలో మూడేళ్ల వ్యవధిలోనే 24వేల మంది టీనేజర్లు (14-18ఏళ్ల వయసు) ఆత్మహత్యకు పాల్పడినట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీరిలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని కారణంతోనే దాదాపు 4వేల మంది ప్రాణాలు తీసుకున్నట్లు తెలిపింది. దేశంలో టీనేజర్ల ఆత్మహత్యలకు సంబంధించి పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో(NCRB) ఈ వివరాలు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా 2017-19 మధ్య కాలంలో మొత్తం 24,568 మంది చిన్నారులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో 13,325 మంది బాలికలు ఉన్నారు. కేవలం 2017లోనే 8029 మంది పిల్లలు ఆత్మహత్యకు పాల్పడగా, 2018లో 8162, 2019లో 8377 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లోనే 3115 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్‌లో 2802, మహారాష్ట్రలో 2527, తమిళనాడులో 2035 మంది టీనేజర్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

పరీక్షలు, ప్రేమ వ్యవహారాలే ఎక్కువ..

మూడేళ్లలో చోటుచేసుకున్న ఈ కేసుల్లో.. పరీక్షల్లో తప్పడం వల్లే 4046 మంది పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక వివాహాలకు సంబంధించి 639 మంది మృతి చెందినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. వీరిలో 411 మంది బాలికలే ఉన్నారు. 3315 మంది ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కారణాలతో ఆత్మహత్య చేసుకోగా, 2567 మంది అనారోగ్యంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. సన్నిహితులు మరణించడం, మద్యానికి బానిసగా మారడం, అక్రమ గర్భం, నిరుద్యోగంతో పాటు పేదరికం వంటి ఇతర కారణాలు కూడా బలవన్మరణాలకు దారితీసినట్లు నివేదిక వెల్లడించింది.

పిల్లలతో పాటు యవ్వనదశలో ఉన్నవారి మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగానే ఉంటాయని బాలలహక్కుల నిపుణులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి వంటి సంక్షోభం సమయంలో ఇలాంటి పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అందుచేత చిన్నారుల్లో మానసిక ఒత్తిడి, ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు సమస్యలను అధిగమించే విధంగా వారికి అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని