
Road Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి
జుక్కల్: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బిచ్కుంద మండలం జగన్నాథపల్లి గేట్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. క్వాలీస్ వాహనంలో 12 మంది నాందేడ్ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్నారు. వీరంతా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖందర్ దర్గాలో మొక్కులు తీర్చుకొని తిరుగు ప్రయాణమయ్యారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్ మండలం జగన్నాథ్‌పల్లి గేట్ వద్దకు రాగానే అదుపుతప్పిన వాహనం అక్కడే ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు క్షతగాత్రులను బాన్సువాడ, నిజామాబాద్ ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ జైపాల్‌రెడ్డి, సీఐ శోభన్, ఆయా మండలాల ఎస్సైలు పరిశీలించి వివరాలు సేకరించారు. మిగతా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మృతుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా వారి వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. మృతులను హైదరాబాద్ చాదర్‌ఘాట్‌కు చెందిన అమీర్ తాజ్ (30), ఆయన భార్య సనా ఫాతిమా (28), వారి పిల్లలు హనియా(2), హన్నాఫ్(4 నెలలు)గా పోలీసులు గుర్తించారు. వీరంతా సంఘటనా స్థలంలోనే చనిపోయారు. అలాగే సనా ఫాతిమా అక్క కూతురు ఆస్మా ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. ఫలక్‌నుమాకు చెందిన మహమ్మద్ హుస్సేన్ (35), ఆయన భార్య తస్లీమ్ బేగం (30) సైతం సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూరా (7) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Advertisement