Crime News: దోపిడీ దొంగను పట్టించిన ఇన్‌స్టాగ్రామ్‌

చెడు వ్యసనాలకు బానిసైన శివ ఎలాగైనా డబ్బులు సంపాదించాలని మరో యువకుడితో కలిసి దోపిడీలకు తెరలేపాడు. రాత్రి సమయంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీల పరంపర కొనసాగించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా బాధితుల కంట పడటంతో ఎట్టకేలకు...

Updated : 11 Dec 2021 18:51 IST

గుంటూరు: చెడు వ్యసనాలకు బానిసైన శివ ఎలాగైనా డబ్బులు సంపాదించాలని మరో యువకుడితో కలిసి దోపిడీలకు తెరలేపాడు. రాత్రి సమయంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీల పరంపర కొనసాగించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా బాధితుల కంట పడటంతో ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగింది. సీఐ సురేశ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన నామాల సతీష్‌, అతని తండ్రి రామకృష్ణారావు నవంబరు 18న ఫంక్షన్‌ నిమిత్తం కొలకలూరు గ్రామానికి వచ్చారు. అదే రోజు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ద్విచక్రవాహనంపై చిలకలూరిపేట నుంచి విజయవాడ బయల్దేరారు. పెదకాకాని మండలం మానససరోవరం దాటిన తర్వాత సర్వీసు రోడ్డు నుంచి హైవేపై ఎక్కుతుండగా వెనుకనుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు.. సతీష్‌, అతని తండ్రి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని తన్నడంతో ఇద్దరూ రోడ్డు మార్జిన్‌లో పడిపోయారు. నిందితులిద్దరూ వారిని బెదిరించి రూ.4వేల నగదు, మొబైల్‌ ఫోన్‌ లాక్కుని పరారయ్యారు.

దోపిడీకి గురైంది తక్కువ మొత్తం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇంటికి వెళ్లిపోయారు. అయితే, నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో దోపిడీ దొంగ ఫొటో రైడర్‌ శివ అనే అకౌంట్‌తో కనిపించింది. వారు వాడిన పల్సర్‌బైక్‌ ఫొటో కూడా అందులో ఉంది. దీంతో వెంటనే సతీష్‌ పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్టా్గ్రామ్‌ ఖాతా ఆధారంగా పోలీసులు శివ గురించి విచారించారు. అతని స్నేహితుల ద్వారా వివరాలు సేకరించి శివను అరెస్టు చేశారు. అతని బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ శివపై చోరీ కేసులున్నట్టు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని