Crime News: విద్యుదాఘాతంతో  పదో తరగతి విద్యార్థి మృతి

కృష్ణా జిల్లా నందిగామలో విషాదం చోటుచేసుకుంది. నందిగామ శివారు అనాసాగరం జడ్పీ హైస్కూల్‌లో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది...

Updated : 25 Aug 2021 22:01 IST

నందిగామ: కృష్ణా జిల్లా నందిగామలో విషాదం చోటుచేసుకుంది. నందిగామ శివారు అనాసాగరం జడ్పీ హైస్కూల్‌లో విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మృతుడు పదో తరగతి చదువుతున్న గోపీచంద్‌గా (15) పోలీసులు గుర్తించారు. గోపీచంద్‌ను పాఠశాలలోని వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేయాలని ఉపాధ్యాయులు సూచించారు. వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే గోపీచంద్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి అప్పటికే మృతి చెందడంతో ఆస్పత్రి ఎదుట కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడే వాటర్‌ ట్యాంక్‌ శుభ్రం చేయాల్సిందిగా చెప్పారని.. ఘటన జరిగిన వెంటనే అక్కడ నుంచి కనిపించకుండా వెళ్లిపోయారని బంధువులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థులతో పనులు చేయిస్తే ఉపేక్షించేది లేదు: ఆదిమూలపు సురేశ్‌

విద్యుదాఘాతంతో విద్యార్థి గోపీచంద్‌ మృతి చెందడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పందించారు. పాఠశాలలో షాక్‌ తగిలి విద్యార్థి మృతి చెందడం బాధాకరమన్నారు. విద్యార్థులను పనులకు వినియోగించుకోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై ఆర్జేడీతో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో ఆయాలను పనులకు వినియోగించుకోవాలని.. విద్యార్థులతో పనులు చేయిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు