Crime News: టెన్త్‌ విద్యార్థినిపై హత్యాచారం కేసు.. ప్రియుడే హంతకుడు!

వికారాబాద్‌ జిల్లాలో సంచలనం రేపిన పదో తరగతి విద్యార్థిని అత్యాచారం, హత్య కేసును పోలీసుల ఛేదించారు.

Published : 31 Mar 2022 01:27 IST

పరిగి: వికారాబాద్‌ జిల్లాలో సంచలనం రేపిన పదో తరగతి విద్యార్థిని అత్యాచారం, హత్య కేసును పోలీసుల ఛేదించారు. ఈ మేరకు కేసు వివరాలను పరిగిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలానికి చెందిన పదిహేనేళ్ల బాలికకు అదే ప్రాంతానికి చెందిన మహేందర్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం బాలిక చెల్లికి తెలియడంతో ఆమె తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. వారు తమ కుమార్తెను మందలించి ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచించారు.

బాలిక ప్రతిఘటించడంతో..

ఇంట్లో జరిగిన ఈ విషయాన్ని మహేందర్‌ దృష్టికి బాలిక తీసుకెళ్లింది. ఎలాగైనా బాలికతో లైంగికవాంఛ తీర్చుకోవాలని భావించిన ప్రియుడు.. తాను సూచించిన ప్రదేశానికి రావాల్సిందిగా ఆమెను కోరాడు. ఈనెల 27న బాలిక అక్కడికి వెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న మహేందర్‌.. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో యువకుడు ఆగ్రహానికి గురై బాలికను తోయగా ఆమె పక్కనే ఉన్న చెట్టుకు తగిలి తీవ్ర గాయాలపాలై కిందపడిపోయింది. అనంతరం ఆమెపై మహేందర్‌ అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక బయటికి చెబుతుందనే భయంతో గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. 

బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించి నిందితుడిని పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ కేసులో ప్రియుడే నిందితుడిగా తేల్చినట్లు ఎస్పీ వివరించారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని