logo

గుత్తేదార్ల కొత్త ఎత్తు.. నిబంధనలు చిత్తు

కంకర లేకుండానే సిమెంటు రహదారులు, భవనాల స్లాబులు, పిల్లర్ల నిర్మాణం.. ఇదేదో నూతన సాంకేతిక పరిజ్ఞానం అనుకుంటే పొరపాటే. ఇదంతా జీఎస్టీ మినహాయింపుకోసం గుత్తేదారులు వేస్తున్న కొత్త ఎత్తుగడ. కేవలం సిమెంటు బిల్లులు మాత్రమే సమర్పిస్తున్నారు. కంకర, ఇసుక వాడుతున్నా

Published : 25 Jun 2022 04:24 IST

జీఎస్టీ మినహాయింపునకు సిమెంటు బిల్లుల సమర్పణ

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం

కంకర లేకుండానే సిమెంటు రహదారులు, భవనాల స్లాబులు, పిల్లర్ల నిర్మాణం.. ఇదేదో నూతన సాంకేతిక పరిజ్ఞానం అనుకుంటే పొరపాటే. ఇదంతా జీఎస్టీ మినహాయింపుకోసం గుత్తేదారులు వేస్తున్న కొత్త ఎత్తుగడ. కేవలం సిమెంటు బిల్లులు మాత్రమే సమర్పిస్తున్నారు. కంకర, ఇసుక వాడుతున్నా వాటికి సంబంధించి బిల్లులు పెట్టడం లేదు. జీరో దందాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధానంలో ఉన్న లొసుగులను అనుకూలంగా మలుచుకుంటున్నారు.  అభివృద్ధి పనుల్లో వాడిన ఇసుక, కంకర, సిమెంటు అన్నింటికి సంబంధించి తప్పనిసరిగా బిల్లులు సమర్పించాల్సి ఉండగా కేవలం సిమెంటు బిల్లులే సమర్పిస్తున్నా తనిఖీ చేయాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదు.

పనుల్లో జీఎస్టీ విధానమిది..

ప్రతి గుత్తేదారునికి జీఎస్టీ లైసెన్స్‌ ఉండాలనేది నిబంధన. రోడ్లు, భవనాలు, ఇతర ఎలాంటి అభివృద్ధి పనులకైనా 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. పనుల అంచనా సమయంలోనే దీన్ని జత చేస్తారు. పని పూర్తయ్యాక బిల్లులు సమర్పించే సమయంలో ఆయా శాఖలు 12 శాతంలో 1 శాతం ఎస్‌జీఎస్‌టీ(రాష్ట్రానికి), 1 శాతం సీజీఎస్‌టీ (కేంద్రానికి) ఇలా 2 శాతాన్ని మినహాయించుకుంటాయి. మిగతా 10 శాతం జీఎస్టీ సదరు గుత్తేదారుకు బిల్లుతో కలిపి విడుదల చేస్తారు. తర్వాత గుత్తేదారు ఆ జీఎస్టీకి సరిపడా పనుల్లో వాడిన ఇసుక, కంకర, సిమెంటు బిల్లులు సమర్పించాలి. అవన్నీ సమర్పిస్తేనే వారిని మళ్లీ పనులు చేసేందుకు అర్హులుగా గుర్తిస్తారు. లేకపోతే జీఎస్టీ అధికారులు రెన్యూవల్‌ చేయకుండా ఆ గుత్తేదారును బ్లాక్‌లిస్టులో పెడతారు. తీసుకున్న జీఎస్టీ డబ్బులు కూడా తిరిగి వసూలు చేస్తారు.

వాణిజ్య పన్నుల శాఖాధికారులు మౌనం

ప్రతి నెల ఆన్‌లైన్‌లో లైసెన్స్‌ ఉన్న గుత్తేదారు బిల్లులు సమర్పించారో లేదో వాణిజ్య పన్నుల శాఖాధికారులు పరిశీలిస్తారు. దీని కోసం ఆ శాఖ రాష్ట్ర, కేంద్ర కార్యాలయాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయి. 10 శాతం జీఎస్టీ బిల్లులు వచ్చాయని వారు సరిపుచ్చుకుంటున్నారు తప్పితే అందులో ఇసుక, కంకర బిల్లులు ఉండడం లేవని గమనించడం లేదు. ఆ బిల్లులు లేవని తిరస్కరించే అధికారం ఉన్నా పట్టించుకోవడం లేదు.
ఈ విషయమై జిల్లా వాణిజ్య పన్నుల శాఖాధికారి యుగేందర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ 10 శాతానికి సరిపడా బిల్లులు వచ్చాయో లేదో అనేది చూస్తాం. కంకర, ఇసుక బిల్లులు లేవని మాకు ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై లోతుగా పరీశీలించి చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ ఎత్తుగడ..

సాధారణంగా ఇసుకను జీరోలో కొనుగోలు చేస్తారు. దానికి బిల్లు దొరకదు. ఇక్కడ కంకర బిల్లులు కూడా సమర్పించకపోవడమే విమర్శలకు తావిస్తోంది. రూ.కోట్లలో దందా నడిచే కంకర క్రషర్లు జీరోలో దందా చేస్తుండటంతో వారు బిల్లులు ఇవ్వడం లేదు.  గుత్తేదారులు సమర్పించడం లేదు. తమకు బిల్లుతో వచ్చిన 10 శాతం జీఎస్టీ మినహాయింపునకు మొత్తం సిమెంటు బిల్లులు జత చేస్తున్నారు. సాధారణంగా నిర్మాణ పనులకు 4 శాతం కంకర, 4 శాతం సిమెంటు, 3 శాతం ఇసుక వాడాలి. కంకర బిల్లు లేకపోవడంతో సిమెంటు విక్రయదారుల వద్ద ఎక్కువ బిల్లులు తీసుకొని సమర్పిస్తున్నారు. ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టేవారు సాధారణంగా బిల్లులు అడగరు. దీంతో సిమెంటు డీలర్లు అవే బిల్లులు గుత్తేదారులకు అమ్ముకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని