logo

భార్య పుట్టినరోజున భర్త మృతితో విషాదం

ఒక పక్క రాఖీ వేడుకలు, మరో పక్క నిండు గర్భిణి అయిన తన భార్య జన్మదినోత్సవం కూడా.. ఈ సంతోష సమయంలో వృత్తి రీత్యా పనికి వెళ్లిన చాందా(టి) గ్రామానికి చెందిన బండారి సాయికిరణ్‌(28) విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

Published : 13 Aug 2022 05:37 IST

ఆదిలాబాద్‌ నేర విభాగం, న్యూస్‌టుడే: ఒక పక్క రాఖీ వేడుకలు, మరో పక్క నిండు గర్భిణి అయిన తన భార్య జన్మదినోత్సవం కూడా.. ఈ సంతోష సమయంలో వృత్తి రీత్యా పనికి వెళ్లిన చాందా(టి) గ్రామానికి చెందిన బండారి సాయికిరణ్‌(28) విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. చాందా(టి) పంచాయతీ వార్డు సభ్యుడైన సాయికిరణ్‌ వేడుకలకు డెకోరేషన్‌ చేస్తుంటాడు. ఆదిలాబాద్‌ పట్టణంలోని సప్తగిరి కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్లో జరగనున్న జన్మదిన వేడుకలకు స్టేజి తదితర నిర్మాణాలు, అలంకరణ చేయటానికి శుక్రవారం పనుల్లో నిమగ్నమయ్యాడు. అలంకరణకు అవసరమైన ఇనుప ఫ్రేమ్‌ మొదటి అంతస్తుకు తరలించే ప్రయత్నంలో పైనున్న 11కేవీ తీగల ద్వారా విద్యుత్తు సరఫరా అయి విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివాహమైన దాదాపు ఏడేళ్ల తర్వాత సాయికిరణ్‌ భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. ఇటీవల వైద్యులకు చూపించగా మరో 15 రోజుల్లో కవలలకు జన్మనివ్వనున్నట్లు వారు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే రామన్న రిమ్స్‌లో పరామర్శించారు. విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అతని తల్లి లక్ష్మీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మావల ఎస్‌ఐ వంగ విష్ణు వర్ధన్‌ తెలిపారు.
నేత్రాలు దానం
సాయికిరణ్‌ తన కళ్లను దానం చేయటానికి ఇది వరకే ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి ఒప్పందపత్రాలు రాసి ఇచ్చాడు.  కుటుంబీకులు అతని కళ్లను దానం చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని