logo

మమేకమవుతూ.. ముందుకు సాగుతూ

 భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర విజయవంతగా సాగుతోంది. ఊరూరా ఆయన అన్నివర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు.

Published : 04 Dec 2022 05:32 IST

విజయవంతంగా సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్ర

దిలావర్‌పూర్‌ మండలం సిర్గాపూర్‌ సభలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

నిర్మల్‌-దిలావర్‌పూర్‌, న్యూస్‌టుడే :  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర విజయవంతగా సాగుతోంది. ఊరూరా ఆయన అన్నివర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. ఆరో రోజైన శనివారం నర్సాపూర్‌(జి) మండలం రాంపూర్‌ నుంచి ప్రారంభమైన యాత్ర గుండంపెల్లి క్రాస్‌రోడ్‌, ఎల్లమ్మ ఆలయం, దిలావర్‌పూర్‌, లోలం మీదుగా సిర్గాపూర్‌ వరకు కొనసాగింది. సంజయ్‌ ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆలయంతోపాటు కదిలి పాపహరేశ్వర ఆలయ విశిష్టతను ఆయనకు రావుల రాంనాథ్‌ వివరించారు. దిలావర్‌పూర్‌లో తెలంగాణ రాష్ట్ర సాధనకు అమరుడైన శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. లోలం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. యువకులు ఆయనకు శివాజీ చిత్రపటాన్ని బహూకరించారు.

విత్తనాలు వేసి.. రైతు సమస్యలు అడిగి...

ఎల్లమ్మ ఆలయ సమీపంలో పసుల గంగారెడ్డి అనే రైతు మొక్కజొన్న విత్తనాలు వేస్తుండగా అక్కడికి వెళ్లిన బండి సంజయ్‌ కాసేపు ఆ రైతు కుటుంబంతో కలిసి విత్తనాలు చల్లారు. రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ రైతుబంధు ఇస్తున్నా.. అన్నీ బందు చేశాడని సంజయ్‌ అనగానే.. రైతు చాలా ఇబ్బందులున్నాయని వాపోయారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సమస్యలన్నీ పరిష్కరిస్తామని సంజయ్‌ భరోసా ఇచ్చారు.

విద్యార్థులకు బోధన..

దిలావర్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి, బాగా చదవుకోవాలని చెప్పారు. దేశ సైనికులుగా ఎంతమంది కావాలనుకుంటున్నారని అడగగా.. బాలికలు సైతం చేతులు ఎత్తడంతో సైన్యంలో చేరి ఏం చేద్దామని అనుకుంటున్నారు.. ఆడ పిల్లలు కదా.. మీ ఇంట్లో వాళ్లు ఒప్పుకొంటారా.. అని అడగ్గా ప్రీతి అనే బాలిక దేశం కోసం సైన్యంలో చేరుతాం.. మా అమ్మానాన్నలు పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పడంతో దేశ రక్షణకు మనమంతా ముందుండాలని సూచించారు. అనంతరం దివ్యాంగుల దినోత్సవంలో పాల్గొని వారికి నోటు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు అందజేశారు. పలువురు దివ్యాంగులకు పింఛన్లు రావడం లేదని వారి తల్లిదండ్రులు, బంధువులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న బండి సంజయ్‌

బాల్య మిత్రులతో కాసేపు సరదాగా..

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను శనివారం సాయంత్రం దిలావర్‌పూర్‌ సమీపంలో శిబిరం వద్ద కరీంనగర్‌లోని సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలలో ఆయనతో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు కలిశారు. వారితో కాసేపు సరదా మాట్లాడారు. తన చిన్ననాటి మిత్రుడు మహేంద్రనాథ్‌ యాదవ్‌ తాండూరులో కంటి వైద్యాధికారిగా పనిచేసి వీఆర్‌ఎస్‌ (స్వచ్ఛంద పదవీ విరమణ) తీసుకున్నారు. ఈ సందర్భంగా మిత్రుడిని బండి సంజయ్‌ను సన్మానించడంతోపాటు బాల్యమిత్రులతో కలిసి ఫొటోలు దిగారు. బాల్య మిత్రమండలి కన్వీనర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వెల్దండి వేణు, విశ్వనాథ అనిల్‌, చెన్నాడె ప్రవీణ్‌, సురేందర్‌రెడ్డి, మంచాల రమేశ్‌, తోట ప్రకాశ్‌, పుల్లూరు రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర నిధులతో చేసిన అభివృద్ధిని వివరిస్తూ..

కేంద్రం ఇస్తున్న నిధులతో గ్రామాల్లో రోడ్లు, మురుగుకాలువల నిర్మాణాలకు విద్యుత్తు స్తంభాలు, లైట్లు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, ఇలా ఎన్నో పనులు జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటోందన్నారు. ఆయా పథకాల ద్వారా గ్రామాలకు వచ్చిన నిధుల వివరాలు వెల్లడిస్తున్నారు. సిర్గాపూర్‌ సభలో కాల్వ, బన్సపెల్లి, సిర్గాపూర్‌ గ్రామాలకు చెందిన యువకులు భాజపాలో చేరారు. ఎంపీ సోయం బాపురావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, యాత్ర సహ ప్రముఖ్‌ డా.మల్లికార్జున్‌రెడ్డి, నాయకులు అయ్యన్నగారి భూమయ్య, అప్పాల గణేశ్‌, గంగాధర్‌, సామ రాజేశ్వర్‌రెడ్డి, మెడిసెమ్మె రాజు, వినాయక్‌రెడ్డి, అమరవేణి నర్సాగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

నేడు ప్రజా సంగ్రామ యాత్ర ఇలా..

నిర్మల్‌ : ప్రజా సంగ్రామ యాత్ర ఏడో రోజైన ఆదివారం నిర్మల్‌ మండలం, పట్టణంలో కొనసాగనుంది. చిట్యాల్‌ గ్రామం నుంచి మొదలయ్యే పాదయాత్ర మంజులాపూర్‌, ఈద్గాం చౌరస్తా, శివాజీచౌక్‌, శాంతినగర్‌, రత్నాపూర్‌-కాండ్లి వరకు సాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని