logo

ఆదిలోనే తెగులు.. ఆందోళనలో అన్నదాతలు

ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినా గత్యంతరం లేక అన్నదాతలు ఏటికి ఎదురీదినట్లు సేద్యం చేస్తూనే ఉన్నారు.

Updated : 04 Feb 2023 06:39 IST

కార్యాలయాలను వదలని అధికారులు

సోన్‌ మండలం ఐబీ-గాంధీనగర్‌ మార్గంలో రహదారి పక్కన   మొగి పురుగు ఆశించి ఎర్రబడుతున్న పొలాలు

భైంసా, న్యూస్‌టుడే : ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినా గత్యంతరం లేక అన్నదాతలు ఏటికి ఎదురీదినట్లు సేద్యం చేస్తూనే ఉన్నారు. అయినా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విత్తనం వేసింది మొదలు పంట చేతికొచ్చేదాక ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. యాసంగిలో వరిసాగుకు నారు పోసుకున్న రైతులు తీవ్ర చలితో సగానికి పైగా మొలకెత్తక మళ్లీ విత్తనాలు వేసుకున్నారు. నాట్లు వేశాక వారం పది రోజుల్లో పచ్చబడాల్సిన నారు ఎర్రబడటం మొదలైంది. దీంతో ఎకరాకు 4 కేజీల గుళికల మందు, ఎరువులు వాడినా పొలం పచ్చబడటంలేదని రైతులు వాపోతున్నారు. మొక్కల మొదళ్లలో మొగి పురుగు ఆశించి ఆకులు మాడిపోయి నాటు వేసిన పాదులు కుళ్లిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొందరి పొలాలు ఎండి పోయాయి. రైతులకు తెలిసిన ఎన్ని పురుగు మందులు పిచికారి చేసినా ప్రయోజనం కనిపించడంలేదు. జిల్లాలో 92వేల ఎకరాల్లో రైతుల వరి నాటు వేస్తున్నారు. నెల రోజులుగా కొనసాగుతున్న నాట్లు దాదాపు 80వేల ఎకరాల్లో పూర్తయినట్లు తెలుస్తోంది.

సూచనలు సలహాలు కరవు..

రైతులకు సూచనలు సలహాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేసింది. రూ.కోట్లు వెచ్చించి క్లస్టర్‌కో రైతు వేదిక నిర్మించింది. వాటిలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి సూచనలు సలహాలు ఇవ్వాలి. కాని ఎక్కడా ఇలాంటి చర్యలు చేపట్టక పోవడం గమనార్హం. జిల్లా ఉన్నతాధికారులు, డివిజన్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పంటల స్థితిగతులను చూసిన దాఖలాలు కనబడటం లేదు. వరి పంటకు సోకిన తెగుళ్లపై సూచనలకోసం భైంసా ఏడీఏ కార్యాలయానికి మూడు రోజులుగా తిరిగినా అక్కడ ఆ అధికారి లేరని రైతు వాపోయడు. నాలుగోరోజు కలిసి రైతు పంట పరిస్థితి వివరించినా సస్యరక్షణ చర్యలు సూచించక పోవడం గమనార్హం.

* సోన్‌ మండలం పాక్‌పట్ల, సోన్‌, శివారులో వరి పొలాల్లో నాటిన కుదుళ్లు మురిగి పోతున్నాయి. వాటికి మొగి పురుగు ఆశించిందని ఎకరాకు సుమారు 2వేల పురుగు మందులు పిచికారి చేసినా ఫలితం లేదని రైతులు వాపోయారు. ఇంతవరకు అధికారులు వచ్చి సూచనలు ఇవ్వడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భైంసా మండలం ఇలేగాం, సిరాల, వానల్‌పాడ్‌, సుంక్లి తదితర గ్రామాలతో పాటు ముథోల్‌ మండలం పిప్రి శివారులోనూ వేల ఎకరాల్లో వరికి తెగుళ్లు ఆశించాయి. ఇప్పటికే ఎకరాకు రూ.15వేలు ఖర్చుచేసి నాట్లు వేసుకున్న రైతుల పంటలను కాపాడలేక పోతే తీవ్రనష్ట వాటిల్లే ప్రమాదం ఉంది.

క్షేత్రస్థాయిలో సందర్శిస్తున్నాం : అంజిప్రసాద్‌, జిల్లా వ్యవసాయాధికారి, నిర్మల్‌

వరిలో తెగుళ్లు ఆశించినట్లు నా దృష్టికి వచ్చింది. డివిజన్‌, మండల వ్యవసాయ అధికారులతో పాటు ఏఈవోలను క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాలని, రైతులకు నివారణ చర్యలపై సూచనలివ్వాలని ఆదేశించాం. వరిలో మొగి పురుగు ఆశించినట్లు గుర్తించాం. నివారణకు నాటు వేసిన 18నుంచి 21రోజుల లోపు ఎకరానికి క్లోరాంట్రానిలిప్రోల్‌ గుళికల మందు ఎకరానికి 4కేజీల చొప్పున ఇసుకలో మిశ్రమం చేసి చల్లాలి. పురుగు మందులు  క్లోరాంట్రానిలిప్రోల్‌, లాంబ్డా సైహలోథ్రిన్‌ ఒక లీటరు నీటికి 2మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేయాలి. పొలం మడులను ఆరబెడుతూ నీటిని అందిస్తే సల్ఫర్‌డయాక్సైడ్‌ గాలిలో చేరి మొగి పురుగు తీవ్రత తగ్గుతుంది. వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టకుంటే నష్ట వాటిల్లే అవకాశం ఉంది.

భైంసా మండలంలో తెగుళ్ల బారిన పడ్డ పొలం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు