logo

ఆగని నిప్పు.. ఆర్పని యంత్రం

ప్రకృతి విపత్తులు చెప్పిరావు. వాటిలో నిప్పు అంటుకుంటే ఆగదు. అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు జరిగే ప్రాణ, ఆస్తి నష్టం అంచనాకు అందదు.

Published : 05 Feb 2023 04:23 IST

అగ్నిమాపక కేంద్రం లేక ఇబ్బందులు

లోకేశ్వరం మండలం పుస్పూర్‌లో ఇటీవల
అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఇల్లు

భైంసా పట్టణం, న్యూస్‌టుడే: ప్రకృతి విపత్తులు చెప్పిరావు. వాటిలో నిప్పు అంటుకుంటే ఆగదు. అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు జరిగే ప్రాణ, ఆస్తి నష్టం అంచనాకు అందదు. అవి జరగకుండా చూడడం ఒకటైతే, మానవ కర్తవ్యంగా జరిగినపుడు వ్యాప్తిచెందకుండా అరికట్టకపోతే దాని పరిణామాలు తీవత్ర ఊహించలేం. వాటి నివారణకు జిల్లాలో ఇప్పటికే మూడు అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. నానాటికి పెరుగుతున్న జనాభా, గ్రామాలు, ఆవాసాలు పెరుగుతున్నాయి. అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఆ అవసరాల మేరకు అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉంది. జిల్లాలోని విస్తీర్ణంలో పెద్దగా ఉన్న ముథోల్‌ నియోజకవర్గంలో  భైంసాలో ఓ కేంద్రం ఉన్నా ఇక్కడి పరిస్థితుల దృష్టా ముథోల్‌లో మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్ధాల నుంచి డిమాండ్‌ నెలకొంది. అయితే అది నేటికి నెరవేరడం లేదు. ఈ ప్రాంతంలో అగ్నిమాపక సేవలు అందించేందుకు  భైంసాలో ఓ అగ్నిమాపక కేంద్రం ఉంది.  మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. ముథోల్‌లో మరొక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తే  ముథోల్‌, బాసర, తానూరు మండలాలకు సౌలభ్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఆ శాఖ అధికారులే అంగీకరిస్తున్నారు.  గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా మోక్షం లభించడం లేదు. ఫలితంగా మారుమూల ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగినపుడు కాలిబూడిదైన తరువాతనే అగ్నిమాపక శకటం వస్తుందనే దురభిప్రాయం ఏర్పడింది.

భైంసా అగ్నిమాపక కేంద్రం


ఆ జిల్లాలో కొత్తగా మూడు మంజూరయ్యాయి

సరిహద్దు నిజామాబాద్‌ జిల్లా నందిపేట, బాల్కొండ,  జగిత్యాల జిల్లాల ధర్మపురిలో అక్కడి డిమాండ్‌ మేరకు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోనే మూడు అగ్నిమాపక కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేయగా త్వరలోనే ఏర్పాటు కానున్నాయని సమాచారం. అయితే ఇక్కడ ఎందుకు మంజూరు చేయడం లేదని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఆరంభంలోనే ఎండల తీవ్రత పెరుగుతుంది. ఇటీవల భైంసా పట్టణం, మండలం, లోకేశ్వరం, ముథోల్‌ మండలాల్లోని ఒక్కో గ్రామంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుని ఇల్లు బుగ్గిపాలయ్యాయి. బాధిత కుటుంబాలు రూ.లక్షల ఆస్తి నష్టపోయారు. రాబోయే వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య, తీవ్రత పెరిగే ప్రమాదం లేకపోలేదు. పెద్ద ప్రమాదాలు సంభవిస్తే తక్షణ సేవల కోసం రెండు, మూడు అగ్నిమాపక శకటాలు, సిబ్బంది అవసరం ఉంటుంది. దూరం నుంచి రప్పించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలోనే మరొ కేంద్రం ఉంటే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చు.


ప్రయత్నం కొనసాగుతుంది

- జి.విఠల్‌రెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే

ముథోల్‌ నియోజవకర్గం జిల్లాలోనే అధిక మారుమూల గ్రామాలతో పాటు విస్తీర్ణంలో పెద్దగా ఉంది. ఈ ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకున్నపుడు భైంసా అగ్నిమాపక కేంద్ర సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి సేవలు అందిస్తున్నారు. ఇక్కడి పరిస్థితుల మేరకు ముథోల్‌లో మరొకటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదించాం. మంజూరు కోసం ప్రయత్నం నా వంతు కృషి చేస్తున్నాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని