logo

అందని అనుమతుల రుసుం

జిల్లాలోని పంచాయతీల్లో నూతనంగా ఇంటి నిర్మాణాలు చేసుకునే వారు చెల్లించే డబ్బులు మీ సేవా కేంద్రాల నుంచి పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోకి పంపడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.

Published : 06 Feb 2023 05:17 IST

నంనూరు పంచాయతీ కార్యాలయం

మంచిర్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని పంచాయతీల్లో నూతనంగా ఇంటి నిర్మాణాలు చేసుకునే వారు చెల్లించే డబ్బులు మీ సేవా కేంద్రాల నుంచి పంచాయతీల బ్యాంకు ఖాతాల్లోకి పంపడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. పల్లెల్లో ఇంటిని నిర్మించుకోవాలన్నా.. లేఅవుట్‌ల కోసం మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసి డబ్బులు చెల్లిస్తేనే పంచాయతీలు అనుమతులు ఇస్తాయి. ఇలా చెల్లించిన నిధులు నేరుగా రాష్ట్ర ఖజానా కార్యాలయానికి వెళ్తాయి. అక్కడి నుంచి పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయం ద్వారా జిల్లా పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఏడాదికి పైగా నిలిచిపోవడంతో పంచాయతీలకు డబ్బులు అందడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు గడువు సమీపిస్తుండటంతో నిధులు అందక పంచాయతీలు నష్టపోతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలోని పంచాయతీల్లో నూతనంగా ఇంటి నిర్మాణం చేసుకునేందుకు తొలుతగా మీసేవా కేంద్రాల ద్వారా పంచాయతీలకు అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి. దీనికోసం మీసేవా కేంద్రాల్లోనే నిర్దేశిత రుసుం చెల్లించి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వాటిని పంచాయతీల్లో ఇస్తే నిర్మాణ అనుమతి పత్రాలు అందజేస్తారు. ఈ ప్రక్రియలో మీసేవా కేంద్రాల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన నిధులు నేరుగా రాష్ట్ర ఖజానాకు నిర్వాహకులు అందజేస్తారు. దీనికోసం కొంతమేరకు కమీషన్‌ను వారు పొందుతారు. అనంతరం ఖజానా ఖాతా నుంచి ఆయా పంచాయతీలకు నిర్మాణ రుసుం డబ్బులు పంపిణీ చేస్తారు. ఇందులో ఒక్కో నెలకు సుమారుగా రూ.2 లక్షల మేరకు ఆయా పంచాయతీలు ఆదాయాన్ని ఆర్జిస్తాయి. ఇలా 2021 అక్టోబర్‌ నాటికి రూ.15 లక్షల మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయం ద్వారా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు మీసేవా కేంద్రాల ద్వారా నిధులు అందజేశారు.. ఆ తరువాత నుంచి ఇంటి నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల కోసం చెల్లించిన నిధులు పంచాయతీలకు పంపిణీ చేయడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిధులు అందితే ట్రాక్టర్ల కిస్తీలు చెల్లించే అవకాశం ఉంటుందని, గ్రామాభివృద్ధికి ఊతమిచ్చినట్లవుతుందని పలువురు సర్పంచులు కోరుతున్నారు. ఈఏడాది మరో రూ.15 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇంతవరకు నిధుల పంపిణీ పూర్తి కాకపోవడంతో సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.

జిల్లాలోని పంచాయతీలు, నష్టపోయిన నిర్మాణ రుసుం వివరాలు...
జిల్లాలోని పంచాయతీలు : 311
2021 నవంబరు నుంచి పంచాయతీలకు జమ చేయాల్సిన అనుమతుల రుసుంలు: రూ. 30 లక్షలు (సుమారుగా)
ఒక్కో నెలకు జమవుతున్న నిధులు: రూ. 2 లక్షలు (సుమారుగా) 2021 అక్టోబరు వరకు పంచాయతీలకు చెల్లించిన నిధులు : రూ. 15 లక్షలు


మంజూరైన వెంటనే పంచాయతీలకు చెల్లిస్తాం
- ఫణీందర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి, మంచిర్యాల.

ఏడాది కాలంగా నిధులు పంపిణీ కావడం లేదు. రాష్ట్ర కమిషనర్‌ కార్యాలయం నుంచి రూ.15 లక్షల చెల్లించనున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిధులు మంజూరైన వెంటనే చలాన్ల ద్వారా ఆయా పంచాయతీలకు చెల్లిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిధుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికోసం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని