logo

‘ఉపాధి హామీ’ తగ్గిందేమి?

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కల్పించాల్సిన పనిదినాలు ఏటా తగ్గుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను కేంద్రం ఖరారు చేసింది.

Published : 07 Feb 2023 06:32 IST

2023-24 ఆర్థిక సంవత్సరానికి పనిదినాల్లో భారీ కోత
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కల్పించాల్సిన పనిదినాలు ఏటా తగ్గుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికను కేంద్రం ఖరారు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత ఏడాదితో పోల్చుకుంటే వచ్చే సంవత్సరం దాదాపు 28 లక్షల పని దినాల్లో కోత విధించింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో 10 లక్షలకు పైగా పనిదినాల్లో కోత పడగా కుమురం భీం జిల్లాలో 5 లక్షలు, మంచిర్యాలలో 3 లక్షలకు పైగా పనిదినాలు తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూలీ పనులపై ఆధారపడి జీవించే పేదలకు తాజా నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది. దీని ప్రభావం ఉమ్మడి జిల్లాలోని లక్షలాది కుటుంబాలపై పడనుంది. 

గ్రామసభల్లో పనుల గుర్తింపు

గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పనులను మినహాయిస్తే పేద కుటుంబాలకు ఉపాధి హామీ పనులే ఆధారం. రెండు నెలలుగా అన్ని పంచాయతీల్లో గ్రామసభలను నిర్వహించి ఉపాధి హామీ ప్రణాళికను తయారు చేశారు. గ్రామాల వారీగా చేపట్టాల్సిన పనులను గుర్తించారు. కందకాల తవ్వకం, వ్యవసాయ భూముల అభివృద్ధి, హరితహారం, రాళ్లకట్టలు, మట్టికట్టలు, చెరువుల్లో పూడికతీత, కాల్వల తవ్వకం తదితర పనులను చేసేందుకు నిర్ణయించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించినట్లుగానే కూలీల పని దినాలను సైతం భారీగా తగ్గించింది.

లక్ష్యం చేరితే ఖాళీగా ఉండాల్సిందే

గతంలో ఉపాధి హామీ ప్రణాళికలో అంచనాలకు మించి కూలీలు పనులకు వస్తే 15 శాతం పని దినాలను పెంచుకునేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం కూలీల సంఖ్య, వారికి కేటాయించిన పనులు, చెల్లింపులు అన్నీ ఆన్‌లైన్‌లో నిర్ధారితమవుతున్నాయి. డిమాండుకు మించి పనులు కల్పించే అవకాశం లేదు. ఒకవేళ నిర్ధారిత పనిదినాలను కూలీలు జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే వినియోగించుకుంటే మార్చి నెలలో ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఏటా శతశాతం లక్ష్యాన్ని ఎక్కడా చేరుకోవడం లేదు. నిర్ణీత కొలతల ప్రకారం పని చేస్తే రోజూ కూలీ గరిష్ఠ ధర రూ.257గా నిర్ణయించినా కొలతల్లో తేడా కారణంగా సగటున రూ.200లకు మించి డబ్బులు రావడం లేదు. రికార్డుల ప్రకారం నమోదైన జాబ్‌కార్డులు, కూలీల సంఖ్య కంటే తక్కువ మందే ఈ పనులను వినియోగించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు