logo

Adilabad: అనుకోని ఘటన.. అంతులేని ఆవేదన!

వారంతా మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లా దెగ్లూరు తాలూకా బోర్‌గావ్‌ గ్రామస్థులు. చంద్రపూర్‌ జిల్లాలో జరుగుతున్న మహంకాళి జాతరకు వెళ్లారు.

Updated : 07 Apr 2023 09:30 IST

వాగులో పడిన అంబులెన్స్‌ను బయటకు తీస్తున్న స్థానికులు

ఈనాడు, ఆదిలాబాద్‌ , - న్యూస్‌టుడే, జైనథ్‌: వారంతా మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లా దెగ్లూరు తాలూకా బోర్‌గావ్‌ గ్రామస్థులు. చంద్రపూర్‌ జిల్లాలో జరుగుతున్న మహంకాళి జాతరకు వెళ్లారు. అక్కడ సుభద్రాబాయి(72) గుండెపోటుతో చనిపోయారు. పుట్టెడు దుఃఖంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం తరోడ వాగులో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో అదుపుతప్పి పడిపోయింది. గమనించిన స్థానికులు స్పందించి అంబులెన్స్‌లో ఉన్న అయిదుగురిని కాపాడారు. మృతదేహం అయిదు గంటలకుపైగా వాగులోనే ఉండిపోయింది. ఊరుకాని ఊరిలో ఎదురైన కష్టాలకు బోరుమన్నారు. అగ్నిమాపక శాఖ అధికారి దుర్గే శివాజీ నేతృత్వంలో డీవోపీ ఎం.రవి, ఎల్‌ఎఫ్‌ ఖధీర్‌, హోంగార్డు సాంబాజీలు, స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. 

రహదారిపై వాహనాల రద్దీ పెరగడంతో మృతదేహాన్ని పక్కకు తీసుకెళ్తున్న కుటుంబీకులు

అంబులెన్సు వాగులో కూరుకుపోవడంతో మృతదేహాన్ని వాగు పక్కనే ఉంచి మరో అంబులెన్సు కోసం పడిగాపులు కాశారు. సుదూర ప్రాంతం కావడంతో స్థానికులు మరో అంబులెన్సు తెప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారే తమ ప్రాంతం నుంచి అంబులెన్సును తెప్పించుకున్నారు. మరోవైపు ఎండ తీవ్రత పెరగడంతో మృతదేహన్ని వదిలి నీడ పట్టున ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రాణాలు కాపాడిన స్థానికుల సాయాన్ని తలచుకుంటూ.. ఉబికివచ్చిన కన్నీళ్లను దిగమింగుకుంటూ మృతదేహాన్ని మధ్యాహ్నం 12 గంటల తర్వాత తీసుకెళ్లారు. ఆనందంగా సాగాల్సిన వారి తీర్థయాత్ర.. అంతిమయాత్రగా మారడాన్ని బాధిత కుటుంబీకులు జీర్ణించుకోలేకపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని