logo

నిప్పు.. నిర్లక్ష్యం చేస్తే పెను ముప్పు

వేసవి వచ్చిందంటే సహజంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ప్రధానంగా అడవుల్లో కార్చిచ్చులు  మొదలవుతాయి.  అటవీప్రాంతంలో జరిగితే మనకొచ్చిన ఇబ్బందేంటని నిర్లక్ష్య వైఖరి చాలా   మందిలో కనిపిస్తుంటుంది.

Published : 28 Mar 2024 03:29 IST

కార్చిచ్చుల కాలం.. అప్రమత్తత అవసరం
న్యూస్‌టుడే, నిర్మల్‌ పట్టణం/మామడ

మామడ మండలం లింగాపూర్‌లో కార్చిచ్చుపై అవగాహన కల్పిస్తున్న అటవీ అధికారులు

వేసవి వచ్చిందంటే సహజంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ప్రధానంగా అడవుల్లో కార్చిచ్చులు  మొదలవుతాయి.  అటవీప్రాంతంలో జరిగితే మనకొచ్చిన ఇబ్బందేంటని నిర్లక్ష్య వైఖరి చాలా   మందిలో కనిపిస్తుంటుంది. కానీ, అది ప్రకృతి- పర్యావరణం, తద్వారా జంతు, జీవజాతులకు పరోక్షంగా నష్టం కల్గించే అంశమని గుర్తించలేకపోతున్నారు. సహజసిద్ధంగా వాటిల్లే ప్రమాదాలను పక్కనపెడితే, మానవ తప్పిదాలతో మంటలు వ్యాపించడం శోచనీయం. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో అటవీశాఖ తీసుకుంటున్న జాగ్రత్తలు ఎలాగూ ఉంటాయి. పౌరులుగా మనమూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే అందరం కలిసికట్టుగా ఈ ఉపద్రవాన్ని సులభంగా దాటేయొచ్చు. 


‘ఇటీవలకాలంలో అమ్రాబాద్‌, కవ్వాల్‌, తాడ్వాయి, ఇల్లెందు అటవీప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. అటవీప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల వల్ల వన్యప్రాణులతో పాటు విలువైన అటవీ సంపదకు నష్టం వాటిల్లుతోంది. అటవీశాఖతో పాటు ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలి. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ. అటవీప్రాంతాల గుండా ప్రయాణించేవారు బీడీలు, సిగరెట్లు కాల్చి పడేయొద్దు. వంట చేసుకోవద్దు.’

రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ


ఆహార గొలుసు ఛిన్నాభిన్నం

అడవిలో మంటలిలా వ్యాపిస్తుంటాయి..

అడవిలో మంటలు వ్యాపిస్తే మన ప్రాంతంలో ‘ఎలగడ’ తగిలింది అంటారు. కాలేది అడవిలోని ఆకులే కదా.. దానికంత ఆలోచించడం దేనికని నిర్లక్ష్యంగా భావించొద్దు. ఎందుకంటే.. ఇది ప్రకృతి విపత్తుకు దారితీసే ప్రమాదం ఎక్కువ. కాలే ఆకుతో పాటు చిన్న మొక్కలు మాడిపోతాయి. క్రిమికీటకాలు చనిపోతాయి. వాటిని తినే జంతువులకు ఆహారం కొరత ఏర్పడుతుంది. పడిపోయిన చెట్లూ కాలిపోతాయి. వాటిపైన ఉండే చెదలును ఎలుగు బంట్లు తింటుంటాయి. అది కాలిపోతే ఆహారం కష్టమవుతుంది. కార్చిచ్చు అంటుకున్నప్పుడు సరీసృపాల (నేలపై పాకుతూ వెళ్లే జీవులు)కు ప్రాణనష్టం ఎక్కువ. గడ్డి మైదానాలు అంతగా లేని ఉమ్మడి జిల్లా అడవుల్లో ఉన్న కాస్త గడ్డి అగ్గితో బుగ్గవుతుంది. శాకాహార జంతువులకు ఇది శాపంగా మారుతుంది. నిజానికి రాలిన ఆకులు నేలలో కలిసిపోతే చాలా లాభాలుంటాయి. అవన్నీ తేమతో ఘన వ్యర్థాలుగా మారుతాయి. క్రిమికీటకాలకు ఆహారంగా పనికొస్తాయి. నేలలో కలిసి అడవిలోని చెట్లకు పోషకాలనిస్తూ సేంద్రీయ ఎరువుగా పనికొస్తాయి.

అటవీచట్టం ఇలా..

అడవిలోకి అగ్గిపెట్టెతో వెళ్లినా నేరమే అంటారు. అటవీ చట్టం 1967, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం అడవిలో నిప్పు పెట్టడం, పొగతాగడం, చెట్లను నరకడం, వన్యప్రాణులను వేటాడటం నిషేధం. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంది.

అధికారులు అప్రమత్తమవుతున్నా..

అడవికి నిప్పు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏటా ఫిబ్రవరి నుంచే నివారణ చర్యలు మొదలు పెడుతుంది. ఇందులో ప్రధానమైనది ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు. రహదారుల పక్కన రాలిన ఆకులను దూరం చేస్తారు. అడవిలో పడిన వాటిని బ్లోయర్‌ల సాయంతో దూరం దూరం (ఫైర్‌లైన్స్‌) చేస్తారు. వాటిని దగ్గరుండి మరీ కాల్చేస్తారు. ఆ మంటలు మరో చోటకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉమ్మడి జిల్లాలో ఈ విషయమై స్థానికులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు మొదలయ్యాయి.


ఆకుతోనే అసలు సమస్య..

ఆకులు ఎండిపోయి ఇలా రాలిపోతుంటాయి..

ఏటా ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించడం చూస్తుంటాం. చాలా మంది దానిని తేలిగ్గా తీసుకుంటారు. ఇక్కడ సంభవించే అగ్నిప్రమాదాలకు కారణాలేంటీ..? నివారణకు ఏం చేయాలి..? అనే విషయంలో అందరికీ అవగాహన ఉండాలి. నాలుగు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా టేకు, ఇప్ప, మేడి తదితర చెట్ల ఆకులు కుప్పలుకుప్పలుగా రాలిపోయి, ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఇవే అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయి.

కారణాలిలా...

అడవుల్లో మంటల వ్యాప్తికి పలు కారణాలు దోహదం చేస్తుంటాయి. కొండప్రాంతాల్లోంచి రాళ్లు పడినపుడు ఆకుల్లోని సిలికా (ఇసుక రేణువుల్లా గరుకుగా ఉండే పదార్థం) రాపిడికి గురై మంటలు వస్తాయి. మన ప్రాంతంలో ఇలా జరిగేందుకు చాలా తక్కువ అవకాశం ఉంటుంది. మానవ తప్పిదాలతో వ్యాపించే అవకాశమే 90 శాతానికి పైగా ఉంది. నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో రహదారులకు పక్కనే అడవులు ఉన్నాయి. డిసెంబరు నుంచి మార్చి వరకు టేకు చెట్ల ఆకులు బాగా రాలుతాయి. వాహనాల్లో వెళ్తున్న వారు సిగరెట్‌, బీడీలు పూర్తిగా ఆర్పకుండానే పారేస్తుంటారు. అది ఒక్క ఆకుకు తగిలినా క్రమంగా విస్తరిస్తూ పోతుంది. వాహనాల్లోంచి అటవీ ప్రాంతంలో నిర్లక్ష్యంగా అగ్గిపుల్లలు, సిగరెట్లను పారేయొద్దు. పశువులను, మేకలను తీసుకొని మేతకు వెళ్లే వారు బీడీ పారేసినప్పుడు మంటలు అంటుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అడవిలో పొగతాగక పోవడం ఉత్తమం..


పూర్తిస్థాయిలో చేస్తేనే..

రాలిన ఆకులను కాల్చేసిన అనంతరం ఇలా..(మామడ మండలం దిమ్మదుర్తి అటవీ ప్రాంతంలో ఇటీవల కనిపించిన చిత్రం)

ప్రస్తుతం రహదారుల పక్కన ఫైర్‌ లైన్స్‌ ఏర్పాటుచేస్తున్నారు. ఏటా వీటికోసం అటవీశాఖ నుంచి నిధులు కేటాయిస్తుంటారు. వీటిని ఎంత మేర చేశారనే కొలతల ఆధారంగా నిధులు విడుదలవుతుంటాయి. ఈ సంవత్సరం మునుపటిలా నిధుల కేటాయింపు లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డు సమీపంలో, ఊర్లకు దగ్గరగా మాత్రమే జాగ్రత్తలు తీసుకోగల్గుతున్నారు. అడవుల్లో లోపలి ప్రాంతంలో అంతగా శ్రద్ధ పెట్టడం లేదని సమాచారం. దూరంతో సంబంధం లేకుండా అటవీప్రాంతం మొత్తం కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టగలిగితేనే ఆశించిన ప్రయోజనాలు చేకూరుతాయి.


అప్రమత్తంగా ఉన్నాం

రాంకిషన్‌, జిల్లా అటవీశాఖ అధికారి, నిర్మల్‌

వేసవి నేపథ్యంలో అడవుల్లో ఏర్పడే కార్చిచ్చుల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా అగ్నిప్రమాదాలు జరిగితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మాకు సమాచారం వస్తుంది. కొందరు ఫోన్లోనూ సమాచారమిస్తుంటారు. అప్పటికప్పుడు మంటలు ఆర్పేయలేకపోయినా, అవి విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజలు నిర్లక్ష్యవైఖరి వీడి అడవుల సంరక్షణలో తమవంతు సహకారం అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని