logo

కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ..

అనూహ్య మలుపులు తిరిగిన ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఆత్రం సుగుణకే ఖరారైంది. ఉట్నూరుకు చెందిన టీచర్‌, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సుగుణ పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) ఆమోదించింది.

Updated : 28 Mar 2024 05:02 IST

ఉత్కంఠకు తెరదించిన కాంగ్రెస్‌
ఈటీవీ - ఆదిలాబాద్‌ 

ఎమ్మెల్యే బొజ్జును కలిసిన ఆత్రం సుగుణ దంపతులు

అనూహ్య మలుపులు తిరిగిన ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఆత్రం సుగుణకే ఖరారైంది. ఉట్నూరుకు చెందిన టీచర్‌, మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్న సుగుణ పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) ఆమోదించింది. బుధవారం రాత్రి ఈమేరకు కాంగ్రెస్‌ జాబితా విడుదల చేసింది. మరో 13 ఏళ్ల పాటు సర్వీసు ఉండగానే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి ఈ నెల 12న రాజీనామా చేసిన ఆమె 13న కాంగ్రెస్‌లో చేరారు. అంతకంటే ముందు నుంచే ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) పరిశీలనలో ఉన్న ఆమె అభ్యర్థిత్వంపై ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)లో ఏకాభిప్రాయం కుదరడంతో పార్టీ ప్రకటించిన జాబితాలో ఆమెకు స్థానం లభించింది. 

కలిసొచ్చిన అంశాలు..

భర్త పిల్లలు సహా సుగుణ కూడా వామపక్ష భావజాలాన్ని కలిగి ఉన్నారు. తెలంగాణ మలి ఉద్యమంతోపాటు ఉపాధ్యాయ, ఆదివాసీ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పని చేయడం,  జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమితులైన సీతక్కతో సన్నిహిత సంబంధాలు కలిసి వచ్చాయి.

ఎన్నో మలుపులు..

ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయం కాంగ్రెస్‌లో ఎన్నో మలుపులు తిరిగింది. ఓ దశలో సీఎంవో నుంచి ఆదిలాబాద్‌ రిమ్స్‌ ప్రొఫెసర్‌ డా.సుమలత పేరు తెరపైకి వచ్చింది. అంతకుముందు  ఖానాపూర్‌ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌, శాసనసభ ఎన్నికల ముందు టికెట్‌ ఇస్తామని ఏఐసీసీ నేతల నుంచి హామీ పొందిన ఏఐసీసీ సభ్యుడు నరేష్‌ జాదవ్‌ పేరును సైతం సీఈసీ పరిశీలించింది. చివరి నిమిషంలో సుగుణ అభ్యర్థిత్వం తెరపైకి వచ్చింది. ఆమెతోపాటు ఉట్నూరు ఐటీడీఏ ఏపీవో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పీజీ హెచ్‌ఎం పదవికి రాజీనామా చేసిన ఆత్రం భాస్కర్‌ సైతం కాంగ్రెస్‌లో చేరడం మరోసారి ఉత్కంఠకు తెరలేపింది. చివరకు సుగుణకు అవకాశం దక్కింది.


బయోడేటా

పేరు : ఆత్రం సుగుణ
కులం : ఆదివాసీ, గోండ్‌
వృత్తి : ఉట్నూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేశారు. మరో 13 ఏళ్ల సర్వీసు ఉండగానే రాజకీయాలపై ఆసక్తితో ఈ నెల 12న ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు.
బాధ్యతలు : ఆదివాసీ మహిళా ఆర్గనైజేషన్‌ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) సహాయ కార్యదర్శిగా ఉన్నారు. మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు. అరుణోదయ కల్చరల్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కో-కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
భర్త : ఆత్రం భుజంగరావ్‌, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పిట్టబొంగరం ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
పిల్లలు : ఇద్దరు సంతానం(పెద్దకొడుకు ఆత్రం విప్లవ్‌, ఎంబీబీఎస్‌, చిన్న కొడుకు సాయుధ బీటెక్‌ చదువుతున్నారు.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని