logo

పదిలో కొంచెం పైకి..

విద్యార్థుల భవితను నిర్ణయించే పదోతరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సాధించిన ఉత్తీర్ణత గతంలో కన్నా మెరుగుపడింది.

Published : 01 May 2024 02:49 IST

 రాష్ట్రస్థాయిలో 20వ స్థానం
జిల్లాలో 92.42 శాతం ఉత్తీర్ణత

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే : విద్యార్థుల భవితను నిర్ణయించే పదోతరగతి వార్షిక ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సాధించిన ఉత్తీర్ణత గతంలో కన్నా మెరుగుపడింది. రాష్ట్రస్థాయిలో గతేడాది కన్నా మూడు స్థానాలు పైకి ఎగబాకింది. 2022-23 విద్యాసంవత్సరంలో 84.87 శాతంతో 23వ స్థానంలో నిలవగా ఈసారి 92.42 శాతంతో 20వ స్థానంలో నిలిచింది. గతేడాది కంటే 7.55 శాతం ఉత్తీర్ణత పెరిగింది. బాలుర కంటే బాలికలే పై చేయి సాధించడం విశేషం. జిల్లా వ్యాప్తంగా 244 ఉన్నత పాఠశాలల్లో 9283 మంది పరీక్షలకు హాజయ్యారు. 8579 మంది ఉత్తీర్ణత సాధించారు. 704 మంది అనుత్తీర్ణులయ్యారు. మొత్తంగా 92.42 ఉత్తీర్ణత శాతం నమోదైంది.

42 ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఫలితాలు

జిల్లాలో 42 ప్రభుత్వ, 29 ప్రైవేటు పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. గతేడాది ప్రభుత్వంలో 19 పాఠశాలల్లోనే నూరుశాతం ఉత్తీర్ణత నమోదుకాగా ఈ ఏడాది సంఖ్య పెరిగింది. ప్రభుత్వ యాజమాన్యాల్లో 6023 మందికి 5440 మంది పాసయ్యారు. 90.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటులో 3260 మందికి 3139 మంది పాసయ్యారు.

యాజమాన్యాల వారీగా ఉత్తీర్ణత శాతం

ఎయిడెడ్‌(3)-95.65 శాతం, ఆశ్రమ పాఠశాల(13)- 91.18 శాతం, ప్రభుత్వ-(7)- 77.67 శాతం, కస్తూర్బా(18)-91.65 శాతం, ప్రభుత్వ లోకల్‌బాడీ(100)- 85.89శాతం, బీసీగురుకులం(7)-99.79 శాతం, ప్రైవేటు(78)-96.29శాతం, మైనార్టీ(3)-100శాతం, ఆదర్శ పాఠశాల(5)94.46 శాతం, టీఎస్‌ఆర్‌ఎస్‌(1)-100శాతం, సాంఘిక సంక్షేమ(9)-98.67శాతం ఫలితాలు సాధించాయి.

28 మందికి 10/10

ప్రభుత్వ పాఠశాలల్లో 28 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఇందులో 10 మంది మహాత్మాజ్యోతిబాఫులే, 8 సాంఘిక సంక్షేమ గురుకులానికి చెందిన వారు ఉన్నారు. లోకల్‌బాడీలో-3, ఎంజేపీ-10, మైనార్టీ-1, ఆదర్శ-5, టీఎస్‌ఆర్‌ఎస్‌-1, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌-8 మంది చొప్పున మాత్రమే 10 జీపీఏ సాధించారు. ప్రభుత్వ ఉన్నత, కస్తూర్బాలో ఒక్కరికి కూడా 10/10 రాలేదు. ప్రైవేటులో మాత్రం 160 మందికి 10 జీపీఏ దక్కాయి.

రోనా అనంతరం గత రెండేళ్లతో పోలిస్తే జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ విద్యాసంవత్సరంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జరిగినా ఎక్కడా బోధనకు ఇబ్బందులు జరగకుండా విద్యాశాఖ ముందునుంచే చర్యలు తీసుకుంది. అవసరమైన చోట ఎక్కువమంది ఉపాధ్యాయులు ఉన్న చోటు నుంచి తక్కువగా ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తూ బోధన చేపట్టారు. విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రత్యేక తరగతులు, పరీక్షల నిర్వహణ, అభ్యసన పుస్తకాల పంపిణీ, వెనకబడినవారిపై ప్రత్యేకదృష్టి సారించడం వారాంతపు పరీక్షలు వంటి కారణాలతో గతంలో కంటే ఎక్కువగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు ఉపాధ్యాయులు అభిప్రాయవ్యక్తం చేస్తున్నారు.

ఏడాది ఫలితాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుల్లో ఉత్తీర్ణత పరంగా బాలికల హవా కొనసాగింది. గత మూడేళ్ల పది ఫలితాలను పరిశీలిస్తే బాలుర కంటే బాలికలు పైచేయి సాధించారు. ఈ సారి బాలుర కంటే బాలికలు 2.16 శాతం అధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. అయితే గతేడాది ఫలితాలతో పరిశీలిస్తే బాలురలో 8.45 శాతం, బాలికల్లో 6.52 శాతం ఉత్తీర్ణత పెరిగింది.


నిరాశవద్దు

డీఈవో, యాదయ్య

పది ఫలితాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఒత్తిడికి గురికావద్దు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం జిల్లాలో పెరిగింది. అనుత్తీర్ణులైన వారు ఎవరూ నిరాశపడవద్దు. మనోధైర్యంతో సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలి. తల్లిదండ్రులు ధైర్యం చెప్పి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా పోత్సహించాలి. క్షణికావేశాలకు గురై జీవితాలను నాశనం చేసుకోవద్దు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు